కాసిన్ని పూలు

Mar 3,2024 08:18 #Sneha, #Stories, #Women Stories

‘మూడు రోజుల బంగారు బతుకులు వ్యాపారంగా మారెనే’ మార్కెట్లో కట్టలు కట్టలుగా ఒకదాని మీదొకటి పేర్చున్న గులాబీలను చూస్తూ దిగులుగా కూర్చుంది.

పక్కన చిన్న పలక మీద డజను పన్నెండు డాలర్లని రాసుంది. ఏసు త్యాగానికి, ప్రేమకి చిహ్నంగా జనం ఎర్ర గులాబీలు, ఎర్ర పాయింసెట్టియా మొక్కలైన క్రిస్మస్‌ చిహ్నాలని ఆలింగనం చేసుకుంటున్నారు. వీటితో పాటు క్రిస్మస్‌ చెట్లు, దాని డెకరేషన్‌ సామాను, లైట్లు వగైరాతో పండగ కోలాహలం అంబరాన్నంటుతోంది.

కొత్త ఉద్యోగంలో చేరాక ప్రాజెక్ట్‌ పని మీద రెండు వారాలు అమెరికా పంపారు తనని. పిల్లాడికి ఆరేళ్ళు. వాడిని జాగ్రత్తగా చూసుకోమని వంద జాగ్రత్తలు చెప్పి వచ్చింది భర్తకి. ‘మరేం పర్లేదు, వెళ్ళిరా. మేమిద్దరం సరదాగా గడుపుతాం’ అన్నాడు. ఆ క్షణం బానే అనిపిస్తుంది. కానీ తింగరాడు. ఉన్నంతసేపు ఉంటాడు. గబుక్కున గాలి మళ్లితే అన్నీ వదిలేసి ఎటో వెళ్ళిపోతాడు. బయల్దేరే ముందు తల్లికి కూడా చెప్పింది. ‘నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో. రోజూ లక్ష్మి వచ్చి వంట చేస్తుంది. నువ్వు బాబుని గమనించుకో’ అని.

ఆఫీస్‌ అయిపోగానే పక్కనే ఉన్న మార్కెట్‌కి వచ్చి బెంచి మీద కూర్చుంటుంది. ఒక్కోసారి మార్కెట్‌ మూసేవరకు అక్కడే కూర్చుని నచ్చిన పుస్తకాలు చదువుతుంది. పాటలు వింటుంది. శాండ్విచ్‌ తెచ్చుకుని అటు ఇటు చూస్తూ తింటుంది. మధ్యలో అమ్మ వీడియో కాల్‌ చేస్తుంది. పిల్లాడు ఆ టైమ్‌కి తన దగ్గరే ఉంటాడు. చుట్టూ చూపిస్తుంది. వాడి కోసం కొన్న బొమ్మల గురించి చెప్తుంది. ఇంకా ఏదో కావాలంటాడు. సరే అంటుంది.

పుస్తకం చదువుతుండగా పిల్లాడు వీడియో కాల్‌ చేసాడు. ‘హారు నాన్నా! గుడ్‌ మార్నింగ్‌. ఏంటి ఇవాళ తొందరగా లేచావు?

”నువ్వు నా కలలో వచ్చావు మమ్మీ. లేచాక చూస్తే ఇక్కడ లేవు. ఇల్లంతా చూసాను. మమ్మీ మమ్మీ అని పిలిచాను. అప్పుడు గుర్తొచ్చింది. అయ్యో! మమ్మీ అమెరికాలో ఉందని’ గట్టిగా ఏడ్చేశాడు.ఆ మాటలు వినగానే ఆమెకీ ఏడుపు ఆగలేదు. కళ్ళు తుడుచుకుంటూ, ‘వచ్చేస్తా నాన్నా. ఇంకో మూడు రోజులే. డాడీ ఉన్నారుగా. భయపడకు. నీకు బొమ్మలు తెస్తున్నా’ అంది.

‘డాడీ లేడుగా’ మళ్ళీ ఏడ్చాడు.’లేడా?’ ఉన్న కాస్త ధైర్యం దిగిపోయింది. ‘ఏడవకు. అమ్మమ్మకి ఫోన్‌ ఇవ్వు.

”హలో”అమ్మా, ఈయన లేడా?

”లేడు. నిన్న పొద్దున వెళ్ళాడు ఎక్కడికో మరి. రాత్రి పన్నెండైనా రాకపోతే చూసి చూసి మీ నాన్న ఫోన్‌ చేసారు. ఊర్లో లేను, అంతర్వేది వచ్చాను అన్నాడు.

”అదేంటి? అంతర్వేది ఏంటి? ఎందుకు? పిల్లాడిని వదిలేసి?

”బాధ్యత లేనివాడికి ఏం చెప్తామే? ఉద్యోగమా సద్యోగమా? వ్యాపారం చేస్తా వ్యాపారం చేస్తా అంటూ ఊర్లు పట్టుకుని తిరుగుతాడు. మొన్న లక్ష్మి వచ్చింది వంట చేయడానికి. ఇంటి తాళం ఇవ్వకుండా వెళ్ళాడు. అది తిరిగి వెళ్ళిపోయింది. వచ్చేటప్పటికి వంట చేయలేదని అలిగాడు. నేను చేశాను, ఇక్కడ తిని వెళ్ళమంటే, అలిగేసి పనుందని పొద్దున్నే అంతర్వేది వెళ్ళాడు ఫ్రెండ్స్‌తో.

”సరే. వాడు జాగ్రత్త. ఉసూరుమంటాడు. ఏమున్నా నాకు ఫోన్‌ చేస్తా ఉండండి.’ ఇంకేందో అనబోయింది. గొంతు పూడుకుంది. ఫోన్‌ పెట్టేసి కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది. ఇలా చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడం ఎన్నో సారో ఆమె లెక్కపెట్టడం మానేసింది. పిల్లాడు పుట్టినప్పుడు లేడు. వేరే దేశంలో ఉన్నాడు. వాడికి రెండేళ్లప్పుడు గొడవ పడి, అలిగి మూడు సంవత్సరాలు ఇంటి మొహం చూడలేదు. ఆర్నెల్ల క్రితం తిరిగి వచ్చాడు. ఈలోపు పిల్లాడి ప్రీ స్కూల్‌ అడ్మిషన్లు, జ్వరాలు, టీకాలు, హాస్పిటల్‌ బిల్లులు, స్కూల్‌ డొనేషన్లు, బ్యాడ్మింటన్‌ క్లాసులు అన్నిటికీ తనే మగరాయుడిలా కార్‌ ఏసుకుని తిప్పేది. ఇది చాలదన్నట్టు పన్నెండు గంటల ఆఫీస్‌ షిఫ్టులు. పిల్లాడి ఒళ్ళో లాప్టాప్‌ పెట్టి కారు నడుపుతూ మీటింగుల్లో మాట్లాడటం లాంటివి చేసి ఏ పూటకాపూట ‘మమ’ అనిపించేది. పిల్లాడికి తన తల్లి ఏమి అనుభవిస్తుందో అర్థం కాదు. వాడికి ఆ వయసూ లేదు. అరుపులూ, కేకలు లేని ఇంటిని వాడు ఎప్పుడు చూసాడు కనుక తండ్రి ఇలా ఉండకూడదని వాడికి తెలీదు కూడా. వాడి చిన్న మనసులో ఏమి జరుగుతుందో, ఏమిఆలోచిస్తున్నాడోనని తరచుగా ఆవేదన పడుతుంటుంది. పెద్దయ్యాక ఎలా ఉంటాడు? ఎవరికైనా ప్రేమను పంచుతాడా లాంటి ఆలోచనలు రాగానే వాటిని అక్కడే తుంచేస్తుంది. వాడి మీద, వాడు కోల్పోతున్న బాల్యం మీద బెంగ పెట్టుకుంటుంది.

‘ఏంటా అవతారం? ఒళ్ళు చూసుకున్నావా? ఒత్తిడి వల్ల లావు అయిపోతున్నావు. వాకింగ్‌కి వెళ్ళు. బ్యూటీపార్లర్‌కి వెళ్ళు, నీ కోసం టైం తీసుకో’ తల్లి పోరు పెట్టేది. అవన్నీ చేసే లోపు ఇంట్లో మరో రెండు పనులు, పిల్లాడి చదువు లాంటివి చేయచ్చని ఆమె ఆలోచన. సంకల వ్యాక్సింగ్‌కి టైం లేకపోతే డబల్‌ పెర్ఫ్యూమ్‌ కొట్టుకోవడం, కాళ్ళకి లేకపోతే లాంగ్‌ స్కర్ట్‌, ప్యాంట్లు వేసుకోవడం, కాళ్ళు పగిలితే మడాలు కప్పే బూట్లు వేసుకోవడం, కనుబొమ్మలు తీర్చిదిద్దే సమయం లేకపోతే ఆన్లైన్‌లో చిన్న మెషిన్‌ కొనుక్కుని ఇంట్లో చేసుకోవడంలాంటి సర్దుబాట్లు చేస్తుంటుంది.

‘బతకడం మానేసావు’ అని తల్లి తిడుతుంది.

బంధం ఉంచాలా తెంచాలా తెలీక త్రిశంకు స్వర్గంలో ఉంది మూడేళ్ళుగా. అతగాడు ఎన్నడూ బాధ్యత తీసుకుంది లేదు. వ్యాపారం చేస్తానని పెళ్ళైన వెంటనే ఉద్యోగం మానేసి ఇంటి భారం తన మీద వేసేసాడు. అప్పటి నుండి నెట్టుకొస్తూనే ఉంది. ఎవరితో సరిగ్గా పడదు. ఊ అంటే గొడవ, ఆ అంటే రభస. రంకెలు వేస్తాడు. దొరికింది పగలు కొడతాడు. మొదటి సంవత్సరంలోనే డైవర్స్‌ అంది. భయపడ్డాడు. సంపాదించే బంగారు బాతు పోతుందని వెంటనే పిల్లలు అన్నాడు. ఇరుక్కుపోయింది. పరువు కోసం, పిల్లాడి కోసం కుక్కిన పేనులా పడుంటుందని అనుకున్నాడు. అలాగే ఉంది. ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా. పిల్లాడు ఇబ్బందిపడొద్దని వాళ్ళు, వాడి ముందు గొడవలు పడితే నొచ్చుకుంటాడని ఆమె, అందరూ ఆ పసి ప్రాణం కోసమే సర్దుకుపోయారు.

తెల్లారితే శుక్రవారం. ఆదివారం సాయంత్రం తన తిరుగు ప్రయాణం. టైం త్వరగా గడిచిపోతే బాగుండని పదే పదే గడియారం చూస్తూ అక్కడే కూర్చుంది.

శుక్రవారం సాయంత్రం వరకు ఆఫీసులో అటు ఇటు సరిపోయింది. నాలుగు అవగానే కొలీగ్స్‌ అంతా దుకాణం సర్దేసి వెళ్లిపోయారు. సోమవారం నుండి గురువారం వరకు కొలీగ్స్‌ ఉంటారు. కానీ శుక్రవారం నుండి ఆదివారం వరకు ఎవరూ ఉండరు. శని, ఆదివారాలు వస్తున్నాయి అంటే పండగ వాళ్ళకి. కుటుంబాలతో, స్నేహితులతో, ఆరుబయట ఆటలతో, బార్బెక్యూ సాయంత్రాలు, ఇలాంటి వాటితో సరదాగా గడిపేస్తారు. ఆ పర్సనల్‌ టైం ఎవరికీ ఇవ్వరు. కొడుకు గుర్తొచ్చాడు. వాడితో అలా ఎన్నడూ గడపలేదు. తన శని, ఆదివారాలు రాబోయే వారానికి సరిపడా కూరగాయలు కోసి పెట్టుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, పిల్లాడి చదువు, సరుకులు తెచ్చుకోవడం, వీటితో సరిపోతాయి. ఆమె కళ్ళు చెమర్చాయి.కాసేపు ఆఫీస్‌ కింద జిమ్‌కి వెళ్ళింది. సాయంత్రాలు తోచనప్పుడు అక్కడకి వెళ్తుంది. మూలనున్న సైకిల్‌ లేకపోతే వాకర్‌ వెతుక్కుని, చెవిలో పాటలు మోగుతుంటే ఓ గంట కాలక్షేపం చేస్తుంది. షారన్‌ అక్కడే పరిచయమైంది. ముప్పై వరకున్న ఆడవాళ్ల గ్రూప్‌కి తను ఏరోబిక్స్‌ చెప్తుంది. ఒకరోజు వాకర్‌ మీద ఉండగా ‘ప్లీజ్‌ ట్రై ఏరోబిక్స్‌ విత్‌ మీ’ అంది దగ్గరకి వచ్చి. మొహమాటం కొద్దీ సరేనని వెళ్లింది. వెళ్ళాక తెలిసింది ఆ క్లాసు తీవ్రత. అరగంటలో టీషర్ట్‌ మొత్తం తడిసిపోయింది. శరీరాన్ని అలా ఛాలెంజ్‌ చేయడం తనకి నచ్చింది. అప్పటి నుండి షారన్‌ క్లాసు ఎప్పుడుంటే అప్పుడు వెళ్లడం మొదలు పెట్టింది. అమ్మాయిలు డంబెల్స్‌ వాడచ్చు, ముప్పై దాటాక సప్లిమెంట్లు వాడటం, ఆమెకి వ్యాయామంలో పునాదులు వేయడం చేసింది షారన్‌. తక్కువ కాలంలో చాలా దగ్గరయ్యారు ఇద్దరూ. అయిదుంపావు అవుతుండగా మెల్లగా మ్యూజిక్‌ మొదలైంది. గ్రూప్‌ అంతా వచ్చారు. ఎర్రటి డ్రెస్‌ లో షారన్‌ వచ్చింది. ‘హారు లేడీస్‌, స్టార్టింగ్‌ ఇన్‌ ఫైవ్‌ మినిట్స్‌’ అంటూ మ్యూజిక్‌ సౌండ్‌ పెంచింది. ధన్‌ ధన్‌ ధన్‌ ధన్‌, ‘లెట్స్‌ గో ఆన్‌ ఫోర్త్‌ బీట్‌’ అంటూ మెల్లగా మొదలుపెట్టి, శరీరం కాస్త లైన్లో పడ్డాక, స్టెప్పర్‌ ఎక్కి దిగడం, స్పిన్‌ చేయించడం లాంటివి మ్యూజిక్‌తో పాటు సునాయాసంగా అందరితో చేయిస్తూ, మైక్‌ లో మాట్లాడుతూ అందరినీ ప్రేరేపిస్తూనే ఉంది. నలభై ఐదు నిమిషాల తర్వాత క్లాసు అయిపోయింది. అందరూ బ్యాగులు సర్దుకుని బయలుదేరుతుండగా షారన్‌ తన దగ్గరకి వచ్చి, ‘రేపు సాయంత్రం మా ఇంట్లో క్రిస్మస్‌ పార్టీ. మీరు తప్పకుండా రావాలి. ఆదివారం ఇండియా వెళ్లిపోతున్నారు కదా? మళ్ళీ ఎప్పుడో ఏంటో. లెట్స్‌ క్యాచ్‌ అప్‌. తప్పకుండా రావాలి’ అని చెప్పి అడ్రస్‌ వాట్సాప్‌ చేసింది.

రాత్రికి కొడుకుతో మాట్లాడాక, తల్లిని అడిగింది. ‘వచ్చాడా ఇంటికి?

”లేదు. ఫోన్‌ కూడా చేయలేదు. మేము చేస్తే తీయలేదు. పిల్లాడు రెండు మూడుసార్లు అడిగాడు. బెంగ పెట్టుకున్నాడేమోనని మీ నాన్న వాడిని కాసేపు బయటకి తీసుకెళ్లి తిప్పుకొచ్చారు.

‘తర్వాత షారన్‌ పార్టీ గురించి చెప్పింది. ‘వెళ్ళు, అందులో ఏముంది? వాళ్ళ గురించి, వాళ్ళ పద్ధతుల గురించి తెలుస్తాయి. జనంలో కలువు. ఈ సమస్యలు ఎప్పుడూ ఉండేవే. నీకంటూ టైం తీసుకో’ అంది.పార్టీ డ్రెస్‌ కోడ్‌ ఎరుపు లేక వంకాయ రంగని చెప్పింది షారన్‌. వెళ్లిపోవడానికని సర్దేసిన పెట్టెలో నుండి అడుగునున్న ఎర్ర టాప్‌ వెతికి వేసుకుంది. ఇండియా నుండి తన కొలీగ్స్‌ కోసం తెచ్చిన కలంకారీ పెయింటింగ్స్‌లో ఒకటి మిగిలిపోయింది. అది ప్యాక్‌ చేసింది. ఆరు అవుతుండగా షారన్‌ ఇంటి బెల్‌ కొట్టింది.అందరికన్నా తను ఒక పది నిమిషాలు ముందు వెళ్లింది. ‘వెల్కమ్‌’ అంటూ గట్టిగా హత్తుకుంది షారన్‌. తను పెంచుకుంటున్న జింజర్‌, లియోని పరిచయం చేసింది. నిప్పుగూట్లో నాలుగు చెక్క ముక్కలు వేసి తన క్రిస్మస్‌ చెట్టు దగ్గరకి తీసుకు వెళ్ళింది. దాని గురించి కాసేపు చెప్పింది. తర్వాత ఇండియాలో పండగలు ఎలా చేస్తారని అడిగి తెలుసుకుంది. మరికాసేపు పిచ్చాపాటి మాట్లాడాక తను వంటింట్లోకి వెళ్తుంటే. ‘ఏమైనా సాయం చేయనా’ అని వెనక నుండి అడిగింది. రమ్మంది.

చిన్న వంట గది. అందులోనే చాలా శుభ్రంగా, పద్ధతిగా అన్నీ సర్దుకుంది.ప్రతి డబ్బా మీద స్టికర్‌, దాని పైన పేరు వ్రాసుకుంది. ఫ్రిడ్జ్‌ పైన తన కుటుంబం ఫోటోలు, రకరకాల మాగెట్స్‌ అవి ఉన్నారు. పైన చిన్న అటక ఉంది. ఒకటి రెండు అట్ట డబ్బాలు తప్ప ఏమీ లేవు. అటక అంచున ఈ మూల నుండి ఆ మూల వరకు ఎండిపోయిన పుష్ప గుచ్చాలు ఒక తాడుతో కట్టి తలక్రిందలుగా వేలాడుతీసున్నాయి. ఏది ఏ రంగో తెలీనంతగా ఎండిపోయాయి. వాటినే వింతగా చూసింది కాసేపు. తర్వాత మిగతా వారు వచ్చారు. పరిచయాలు అయ్యాక చిన్న చిన్న ఆటలు ఆడారు. గిఫ్టులు మార్చుకున్నారు, డ్రింక్స్‌, స్నాక్స్‌, డిన్నర్‌ చేయడం లాంటివి చేసి అంతా తిరిగి వెళ్లిపోయారు. తనూ బయల్దేరతానంది.

‘తొమ్మిదే అయింది. వాళ్ళు మళ్ళీ క్లాసులో కనపడతారు. మీరు రేపు వెళ్ళిపోతారు కదా? కాసేపు ఉండండి. నేనే నా కారులో దిగబెడతాను’ అంది షారన్‌. హోటల్‌ రూమ్‌కి వెళ్ళి, చేసేది ఏమీ లేక సరేనంది. కాఫీ తెచ్చిచ్చింది.

‘థాంక్యూ”వెల్కమ్‌. నచ్చిందా అమెరికా?

”బాగుంది”ఏం నచ్చింది?”ఆడవారికున్న స్వేచ్ఛ’ ఆలోచించకుండా చెప్పేసింది.

కాఫీ పక్కన పెట్టి తననే చూసింది షారన్‌.ఆమె కళ్ళల్లో నీళ్లు. టిష్యూ అందుకుంది. వెంటనే సర్దుకుని, ‘నేను కాళ్ళు పైన పెట్టుకోవచ్చా?’ అని సోఫాలో వెనక్కి జరిగింది.

‘ఫీల్‌ ఫ్రీ టు”సారీ”సారీ ఎందుకు? ఆర్‌ యూ ఓకే’ అడిగింది.

‘లేదు”హోమ్‌ సిక్‌?”మా బాబు గుర్తొస్తున్నాడు. వాడికి నేను తప్ప ఎవరూ లేరు. అమ్మా వాళ్ళున్నారు కానీ, వాడికి నేను ఏదో సరిగ్గా చేయడం లేదనే బాధ, మంచి బాల్యం ఇవ్వట్లేదనే గిల్ట్‌ ఎక్కువగా ఉంది.”మీ భర్త ?”ఉన్నారు. కానీ ఉండడు. ఎప్పుడూ కొత్త వ్యాపారం అంటాడు. ఊర్లు తిరుగుతాడు. డబ్బులు పోతాయి. అప్పులు నేను పూడుస్తాను. మళ్ళీ ఇంకో వ్యాపారం అంటాడు. మళ్ళీ అదే తంతు. ఈ గోలలో నేను అటు ఇటు పరుగులు పెట్టడం, ఇల్లు నడపడం చూస్తాను తప్ప పిల్లాడితో విలువైన సమయము గడపట్లేదు. మేమందరం సరిగ్గా కలిసి బయటకి వెళ్ళింది లేదు. మేము కలిసి భోంచేసింది మహా అయితే ఒక పది, పదిహేను సార్లు.

”మాట్లాడి చూసారా?’ పక్కన వచ్చి కూర్చుంది షారన్‌.

‘అన్నీ అయ్యాయి. వినడు. తాను పట్టిన కుందేలుకి రెండే కాళ్ళు అన్నట్టు వాదిస్తాడు. కాస్త గట్టిగా మాట్లాడితే నా గురించి స్నేహితులకి, తల్లిదండ్రులకి వ్యతిరేకంగా చెప్తాడు. సెలవు పెట్టి ఎటైనా వెళ్దామంటే, ఈ వ్యాపారం సక్సెస్‌ అయ్యాక అంటాడు. అది అవ్వదు.

వ్యాపారం సక్సెస్‌ అయ్యే వరకు పిల్లాడు పెరగకుండా ఉంటాడా? వాడి వయసుకి తగ్గట్టు వాడికి మంచి మెమోరీస్‌ ఇవ్వాలి కదా? నేను అలా అడిగితే, నువ్వేమైనా పదహారు సంవత్సరాల టీనేజ్‌ పిల్లవా అటు ఇటు తిప్పడానికి, వాడి బాధ్యతలు వాడికి ఉంటాయి అని వాళ్ళ అమ్మగారు అంటారు.

తిప్పడానికి నేను అడగలేదు. కనీసం పిల్లాడి స్కూల్లో ఒక మీటింగ్‌కి అయినా రాకపోతే వాడు చిన్నబుచ్చుకుంటాడు కదా?’ కనీసం ఆ చేసే వ్యాపారం ఏదో చిన్నగా మొదలుపెట్టు అంటే, ఒకటేసారి లక్షలు, కోట్లు గుమ్మరిస్తాడు. ఆస్తులు తాకట్టు పెడతాడు. కొత్త కొత్త స్నేహాలు చేస్తాడు. వాళ్ళతో అతిగా వెళ్తాడు. ఎక్కడో చెడుతుంది. ఆర్నెల్ల తర్వాత ఆ మొహాలు మళ్ళీ కనపడవు.’అబ్యూసివ్‌?

”వెర్బల్‌. హై టోన్‌ అండ్‌ సిక్‌ లాంగ్వేజ్‌”డు యు లవ్‌ హిం?

”తన మీద ప్రేమ కన్నా తిరిగి ప్రేమించడు అనే భయం ఎక్కువుగా ఉంది నాకు’తన చేతి మీద చేయి వేసింది షారన్‌.

కాసేపటికి తనకే సిగ్గేసింది. తెలీని దేశంలో పది రోజుల క్రితం పరిచయమైన వ్యక్తితో ఇంత వ్యక్తిగత విషయాలు ఎలా చెప్పానా అని సారీ చెప్పింది.’మీ పండగ మూడ్‌ పాడుచేయాలని కాదు. తెలీదు ఎందుకు చెప్పానో. మీ దగ్గర ఏదో తెలీని కంఫర్ట్‌’ అంది ఇబ్బందిగా.

‘ఏం పర్లేదు. విత్‌ యు’ గట్టిగా హత్తుకుంది మరింత దగ్గరకి వచ్చి.కాసేపటికి సర్దుకుంది. అతిగా ప్రశ్నలు వేయకుండా, ఒక తన గురించి ఒక నిర్ణయానికి రాకుండా, తను చెప్పింది వింటూ మౌనంగా ఉంది షారన్‌. వినడం ఎంత మంచి కళ అనుకుంటూ, ‘అవునూ, ఆ పువ్వులేంటి అలా వేలాడేసారు?’ అటక చూపిస్తూ అడగింది.

‘ఓహో! అవా, పీటర్‌. పీటర్‌ జ్ఞాపకాలు అవి’ ఆమె పెదవులపై నవ్వు విచ్చుకుంది.

‘పీటర్‌?”నా భర్త”జ్ఞాపకాలు ఏంటి?”క్యాన్సర్‌. నాలుగో స్టేజిలో ఉండగా చనిపోయాడు. రెండేళ్లు అయింది. తను పోయాక ఇదే మొదటి క్రిస్మస్‌ మాకు. నలభై ఏళ్ళు కలిసున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. కొడుకు అండర్‌ గ్రాడ్‌లో ఉన్నాడు. నా కూతురు హైస్కూల్లో ఉంది. రేపు వస్తారు పండక్కి.

‘ చేయి పట్టుకుని టేబుల్‌ మీదున్న ఫోటో ఫ్రేముల దగ్గరకి తీసుకు వెళ్తూ.

‘ఎలా తట్టుకున్నారు?

”పీటర్‌ ప్రేమ నడిపించింది. ప్రేమ కన్నా నేనంటే గౌరవం. కనీసం నన్ను నేనే తిట్టుకున్నా ఊరుకునేవాడు కాదు. ఈగ వాలనిచ్చేవాడు కాదు. నాకు ఎర్ర గులాబీలంటే ఇష్టం. ఒక ప్రేమ కథని అవి చూపినంత గొప్పగా మరేరంగూ చూపించవేమో. అభిరుచులు, కోరికలు, ప్రేమ, రొమాన్స్‌, వీటన్నిటి చిహ్నం ఎర్ర గులాబీలు. అవకాశం దొరికినప్పుడల్లా అవి నాకు తెచ్చి ఇచ్చేవాడు. తన చివరి రోజుల్లో నేనూ అదే పని చేసాను. వారానికొకటి తీసుకువెళ్ళేదాన్ని తన కోసం హాస్పిటల్‌కి. మళ్ళీ తన పరిమళం పీల్చగలనో లేదో అని వాడిపోయాక తన గదిలో నుండి తెచ్చి, ఇంట్లో ఇలా దాచుకున్నా. ఆ గులాబీల్లో తను బ్రతికున్నాడు’ కళ్ళు తుడుచుకుంది.షారన్‌ వైపు చూసింది. వయసులో తనకన్నా పెద్దది, జిమ్‌లో తన కాలు బెణికితే దాన్నిపట్టుకుని కట్టు కట్టింది. నాలుగు రోజులు మాత్రమే ఉంటుందని తెలిసి కూడా ఏమీ ఆశించకుండా వ్యాయామంకి పరిచయం చేసింది. తన ఇంటి తలుపులు తెరిచి, లోపలికి ఆహ్వానించి, ప్రేమ పంచింది. ఇదంతా పది రోజుల పరిచయంలోనే. తన జీవితంలో ఉన్నవారితో పోలిస్తే, తనతో షారన్‌ తో ఉన్న బంధం చాలా చిన్నది. అయినా షారన్‌ నూరు శాతం న్యాయం చేసిందంటే ఇక తన భర్తతో ఎలా ఉండేదో ఊహించుకుంది.’ఈ పాప ఎవరు?’ షారన్‌కి తన భర్తకి మధ్యన నుంచున్న ఒక ఆఫ్రికన్‌ అమ్మాయి ఫోటో ని చూసి అడిగింది.

తల పైకి ఎత్తి, ‘సమైరా. నా కూతురు. తను హైతీ నుండి వచ్చింది. ఆఫ్రికన్‌. అక్కడ భూకంపం వచ్చినప్పుడు చాలా మంది పిల్లలు అనాధులయ్యారు. నేను చర్చి ద్వారా వాలంటీర్‌ చేసి వెళ్ళాను. సమైరాని దత్తత తీసుకున్నాము. ఆరేళ్ళు పట్టింది మొత్తం తతంగం.

”మీ ప్రేమ పొందింది. అదృష్టవంతురాలు.

”లేదు. వచ్చాక ఓ ఆర్నెల్లు మాతో ఉంది. ఆ తర్వాత మాకు వచ్చే డబ్బులు, పీటర్‌ వైద్యం, బాబు కాలేజీ చదువులు, తనని పోషించలేకపోయాం. అన్ని దారులు మూసుకుపోయాక చర్చిలో చెప్పాము. వేరొక ఫ్యామిలీ ముందుకు వచ్చి, మళ్ళీ తనని దత్తత తీసుకుంది. పాపం తనకి అది క్షోభ. నా కొడుకుని అలా వదులుకోలేను కదా? నా రక్తం కాదు కాబట్టి ఇంకొకరికి ఇచ్చేసానా అనే గిల్ట్‌ నాతోనే ఉంటుంది ఎప్పటికీ.

”ఐ యాం సారీ”

లేదు లేదు. సారీ ఎందుకు?. పీటర్‌ ఇందులో కూడా నాతోనే ఉన్నాడు. నా నిర్ణయాన్ని సమర్ధించాడు.. గౌరవించాడు. ఆ పరిస్థితుల నుండి ఆ పిల్లని బయట పడేయడం వరకే నీకు దేవుడు ఇచ్చిన అవకాశం. అక్కడ నుండి వేరే ప్రయాణం అన్నాడు. అప్పుడు కాస్త ఓదార్పు లభించింది.

”ఇంత చేసారా ఇద్దరూ కలిసి? ఇలాంటి కుటుంబాలు కూడా ఉంటాయా అనిపిస్తుంది మీరు చెప్తుంటే.”థాంక్యూ. చేయగలిగినప్పుడు చేసాం. కుదరనప్పుడు మెల్లగా వెళ్ళాము. పీటర్‌ హాస్పిటల్లో ఉన్నప్పుడు, తన కీమో అప్పుడు చేసేది ఏమీ లేదు. పాత జ్ఞాపకాలు నెమరేసుకున్నాం, మా ఇద్దరికీ ఇష్టమైన సినిమాలు చూసాము, ఆ సోఫాలోనే’ ఇందాక కూర్చున్న సోఫా చూపిస్తూ..

‘వావ్‌!”అవును నిజంగానే వావ్‌ మూమెంట్స్‌. అన్నీ సంవత్సరాలుగా కట్టుకున్న జ్ఞాపకాలు. అవే లేకపోతే చివరి రోజుల్లో పీటర్‌ బాధ పడుతూ వెళ్ళేవాడు. నాకు తృప్తిగా ఉంది. సుఖంగా, ఏ నొప్పి లేకుండా, నాతో కలిసి తను చేయాలనుకున్నవన్నీ చేసి నిద్రలో ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. ఇలా చెప్తున్నా అనుకోకండి. సుఖాంతాలు కావాలంటే ముందు సంవత్సరాలు కష్టపడక తప్పదు. అలా అని ఒకరే కష్టపడితే అది బంధం కాదు. స్వార్థం. జ్ఞాపకాలు ఇద్దరూ కలిసి, కట్టుకోవాలి. అప్పుడే గౌరవం ఉంటుంది.”పీటర్‌ని మిస్‌ అవుతారా?”

అవును. ఒకోసారి కష్టంగా కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఏ అర్ధరాత్రో ఆ జ్ఞాపకాలు నా కళ్లలోంచి బయటకొచ్చి నా చెంపల మీద నుండి కిందకి జారతాయి.’తను వెతుకుతున్న సమాధానాలు షారన్‌ దగ్గర దొరికాయి. మనసు ప్రశాంతంగా అయింది చాలా సంవత్సరాల తర్వాత. క్యాబ్‌ బుక్‌ చేసుకుంటాను అంది.’లేదు లేదు నేను డ్రాప్‌ చేస్తాను’ కారు తాళాలు తీసుకుని వచ్చింది.

డ్రైవ్‌ చేస్తూ, ‘మీతో ఒక మాట చెప్పాలి’ అంది షారన్‌.’ప్లీజ్‌. చెప్పండి.

”ఎవరితో అయితే మన భవిష్యత్తు ఊహించుకుంటామో వాళ్లే లేకుండా దాన్ని ఎదురుకోవడం కష్టం.’

అవునన్నట్టు తల ఊపింది.

‘లేకపోవడం అంటే ఫీజికల్‌గా మాత్రమే కాదు. ఎమోషనల్‌గా కూడా అని నా ఉద్దేశం. ఎందుకు చెప్తున్నాను అంటే, మీ భర్తకి మీ పీజ్జా ఆర్డర్‌ దగ్గర నుండి మీ సంతోషం, బాధలు అన్నీ తెలిసుండాలి. మీ ఎమోషన్‌లో తనూ ఒక భాగం కావాలి, అందులో పాల్గొనాలి. షరతులు లేని ప్రేమంటే అంతులేని సహనం కాదు. పరస్పర గౌరవం. మీకు అర్థమైంది అనుకుంట!

‘కళ్ళు తుడుచుకుంటూ తల ఊపింది.మార్కెట్‌ దగ్గరకి వచ్చాక, ‘ఇక్కడ ఒకసారి ఆపుతారా?’ అడిగింది.

‘తప్పకుండా’దిగి వెళ్ళి, అయిదు నిమిషాల తర్వాత డజన్‌ ఎర్ర గులాబీలతో తిరిగి వచ్చింది.ప్రశ్నార్థకంగా చూసింది షారన్‌.

‘మీ దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను. నాకూ మంచి జ్ఞాపకాలు కావాలి. దానికంటే ముందు నన్ను నేను ప్రేమించుకోవాలి. నా గులాబీలు నేనే కొనుక్కుంటాను.

‘షారన్‌ హగ్‌ ఇచ్చింది. బై చెప్పుకున్నారు.మర్నాడు ఎయిర్పోర్ట్‌లో ఉండగా షారన్‌ నుండి మెసేజ్‌ వచ్చింది. తన గార్డెన్‌లో పువ్వుల ఫోటోలు పెట్టింది. కింద చిన్న క్యాప్షన్‌, ‘హౌలా! సెలెబ్రేట్‌ లైఫ్‌!

‘తర్వాత ఇండియా నుండి తల్లి ఫోన్‌. ‘బయల్దేరావా? తను ఇంకా రాలేదు ఊరు నుండి”ఉంటే కదా రావడానికి. ఏం పర్లేదు. ఇక అన్నీ నేను చూసుకుంటాను.’

 

– శ్రీఊహ, 99630 84338

➡️