నవ కేరళ – స్త్రీ భాగస్వామ్యం

New Kerala - Women's Participation
  • పరిజ్ఞానం, సాంకేతికత ఆధారంగా రూపొందించిన ‘నవ కేరళ అభివృద్ధి ప్రణాళిక’లో సమాన న్యాయం, లింగ సమానత్వం హామీ ఇచ్చింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం. పరిశ్రమలు, ఉత్పత్తి, కార్మిక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతామని, ప్రతి రంగంలోనూ మహిళలు పనిచేసే పరిస్థితిని కల్పిస్తామని కేరళ ప్రభుత్వం చెబుతోంది. 

దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్య, వృత్తిపరమైన నైపుణ్యాలు, మెరుగైన ఉపాధి కోసం బాలికల ఆసక్తి, రాజకీయ, సామాజిక రంగాలలో మహిళలకు అధిక ప్రాతినిధ్యం వంటి అనుకూలమైన పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా నవ కేరళ అభివృద్ధి సాధ్యమౌతుంది. కుటుంబశ్రీ సహా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో మహిళల భాగస్వామ్యాన్ని కేరళ ప్రోత్సహిస్తోంది.

దేశంలోనే ఉన్నత విద్యలో అత్యధికంగా మహిళా భాగస్వామ్యం కేరళలో ఉంది. సాంకేతిక విద్య మినహా అన్ని రంగాల్లో అబ్బాయిల కంటే బాలికలే ఎక్కువ. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కోర్సులలో 64 శాతం, మెడికల్‌ అనుబంధ సైన్స్‌ కోర్సులలో 81 శాతం బాలికలు ఉన్నారు. వృత్తిపరమైన అర్హతలు, ఉన్నత విద్యను పొందిన వారి జాబితాలో కేరళలోని మహిళలు ముందున్నారు. వారి సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు పారిశ్రామిక, ఉత్పాదక, కార్మిక రంగాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచాలి. వర్క్‌ప్లేస్‌లను మహిళా-స్నేహపూర్వకంగా చేయడానికి, సమాన వేతనం ఉండేలా పని ప్రదేశాలలో జెండర్‌ ఆడిటింగ్‌ చేయబడుతోంది.

మహిళలపై దాడులను అరికట్టడంలో భాగంగా సత్వర న్యాయం కోసం చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు న్యాయం జరగడంలో జాప్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. త్వరితగతిన విచారణ ద్వారా కేసుల పరిష్కారానికి, హింసను ఎదుర్కొనేందుకు కఠినమైన ప్రోటోకాల్‌ను ఏర్పాటు చేస్తామని, కార్యాలయంలో వేధింపుల ఫిర్యాదులపై సకాలంలో చర్యలు తీసుకుంటామని మహిళలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భరోసా ఇస్తున్నారు.

ఈ క్రమంలో వివిధరంగాల్లో ప్రముఖుల సూచనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. మానసిక వికలాంగుల రక్షణ కోసం కుటుంబశ్రీ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కేర్‌ హౌమ్‌లు ప్రారంభించాలని, మానసిక ఆరోగ్య సంరక్షణ రంగంలో సుదీర్ఘకాలంగా కృషి చేస్తోన్న దయాపాస్కల్‌ ప్రతిపాదించారు.

పోలీసు, అటవీ శాఖల్లో ఉద్యోగాల కోసం ఎస్టీ కేటగిరీకి ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ వుండాలని.. వందశాతం ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో పైలట్‌గా మారిన మొదటి గిరిజన మహిళ ధన్య ప్రతిపాదించారు. వివిధరంగాలలోని మహిళలు, యువతుల నుంచి వచ్చిన ప్రతిపాదనలను స్వీకరిస్తూ.. వారిని నవ కేరళ అభివృద్ధి ప్రణాళికలో భాగస్వాములను చేస్తూ.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది నవ కేరళ.

➡️