ఎలుకా కొరకకే ప్లీజ్‌ ..

  • కేజీబీవీలో విద్యార్థుల పాట్లు
  • వరుస ఎలుక కాట్లుతో బెంబేలు
  • మంగళవారం స్థానిక ఆసుపత్రిలో చికిత్స
  • ఎలుకల నియంత్రణలో అధికారుల చర్యలు శూన్యం

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : పగలంతా తరగతి గదిలో పాఠాలు విన్న ఆ విద్యార్థులు రాత్రిల్లో హాస్టల్‌ గదిలోకి వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. నిద్రిస్తున్న సమయంలో చేతులు, కాళ్లపై ఎలుకలు కొరుకుతుండటంతో ఆ విద్యార్థుల్లో కలవరం మొదలైంది. రాత్రంతా కిచకిచ్‌.. కిచకిచ్‌.. అంటూ గదుల్లో ఆ ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయని విద్యార్థుల వేదన. ఇదీ బైరెడ్డిపల్లి కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల పడుతున్న పాట్లు. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. నియంత్రించేందుకు కనీస చర్యలు చపట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే..

హాస్టల్‌ గదుల్లో ఎలుకలు ఉన్న విషయం అధికారుల దృష్టిలోనూ ఉంది. అయినా చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వస్తువులనూ పాడు చేస్తున్నాయి. ఎలుక కాట్లుకు గురైన విద్యార్థులు, విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకొని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇటీవల ఎలుకలు కొరకడంతో విద్యార్థులు స్థానిక వైద్యశాలలో వైద్యం అందుకున్నారు. మంగళవారం 9మంది 9వ తరగతి విద్యార్థులు ఎలుక కాట్లుకు గురవడంతో తల్లిదండ్రులు వారిని బైరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రికి వచ్చిన విద్యార్థులను చూసి అక్కడి వారు అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఎలుకల కోసం పాములు వస్తే ఎంటి పరిస్థితి అని ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతకీ అధికారులు పట్టించుకోలేదని, ఉన్నతాధికారులైనా స్పందించి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. విషయం బయటకు చెప్పినట్లు తెలిస్తే ఉపాధ్యాయులు, పాఠశాల అధికారులు వేధిస్తారని విద్యార్థులు భయభ్రాంతులకు గురైయ్యారు.

ఇళ్లల్లో ఉన్నట్టే హాస్టల్లోనూ ఉన్నాయ్..- స్వరూప, ఎస్‌వో, కేజీబీవీ పాఠశాల

బైరెడ్డిపల్లిఅందరి ఇళ్లల్లో ఎలుకలు ఉన్నట్లే హాస్టల్లోనూ ఉన్నాయి. కొంత మంది విద్యార్థులు ఎలుక కాట్లుకు గురవ్వడంతో వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఆసుపత్రిలో చికిత్స చేయించాం.

 

➡️