పిఆర్‌-126పై నిషేధం-ఈ రకం వరి సాగుకే రైతుల మొగ్గు

Dec 12,2023 11:19 #Ban, #cultivate, #farmers, #PR-126, #rice crop

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిది : రబీ సాగులో పిఆర్‌-126 రకం ధాన్యంపై అధికార యంత్రాంగం ఆంక్షలు విధించింది. ఈ రకం దిగుబడులు సాగు చేస్తే కొనుగోలు చేయబోమని ఇప్పటికే స్పష్టం చేసింది. అధిక దిగుబడి ఇచ్చే ఈ రకం సాగుకు రైతులు మక్కువ చూపుతున్నారు. అధికారుల ప్రకటన వారిని ఆందోళనకు గురి చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎంటియు 1121, 1156, 1153లతో పాటు ఆర్‌ అండ్‌ ఆర్‌ 15048 వరి రకాలను మాత్రమే పండించాలని రైతులకు ఇటీవల వ్యవసాయ శాఖ నిర్దేశించింది. ఖరీఫ్‌ సీజన్‌లో నల్లజర్ల, చాగల్లు, నిడదవోలు, రాజమహేంద్రవరం రూరల్‌ మండలాల్లో 54,340 ఎకరాల్లో రైతులు పిఆర్‌-126ను సాగు చేశారు. ఎకరాకు 40 నుంచి 50 బస్తాల దిగుబడి వచ్చింది. 75 కేజీల బస్తాకు రూ.1,500 నుంచి రూ.1,600 వరకు ధర పలకడంతో ఎకరాకు రూ.20 వేలకుపైగా రైతులు లాభం పొందారు. 120 రోజుల తక్కువ కాలపరిమితిలో పండే ఈ రకం సాగు పట్ల రైతులు ముందుకు రావడంతో దీనికి డిమాండ్‌ ఏర్పడింది. దీంతో, రబీలో ఈ రకం లక్ష ఎకరాల్లో సాగు చేసేందుకు విత్తనాలను అందుబాటులో ఉంచుకున్నారు. అయితే, ఈ రకం వరిని సాగు చేయరాదని ప్రభుత్వం చెబుతోంది. గత నెలలో ప్రభుత్వం మిల్లర్లతో సమావేశం నిర్వహించింది. రైతులు పండించిన వివిధ రకలా ధాన్యం అమ్మకాలు, తలెత్తుతున్న ఇబ్బందులపై చర్చించింది. పిఆర్‌ 126 రకం వరి సాగును నిషేధించాలని నిర్ణయించింది. సాధారణ రకాలతో పోల్చితే ఈ రకం బియ్యం కొద్దిగా లావుగా ఉంటాయి. తక్కువ నీటి వాడకంతో అధిక దిగుబడి ఇచ్చే ఈ వంగడాన్ని పంజాబ్‌ వ్యవసాయ పరిశోధన శాఖ, అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిప్పిన్స్‌ సంయుక్తంగా రూపొందించాయి. పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని రైతులు ఆరేళ్లుగా ఎ-గ్రేడ్‌ రకంగా దీనిని సాగు చేసి ఆశాజనకమైన ఫలితాలు పొందుతున్నారు. 2016లో ఈ వరి వంగడం పంజాబ్‌ రకంగా మార్కెట్లో విడుదల చేశారు. ఈ రకం ధాన్యం గింజ నాణ్యత బాగుండడం, చేను పడిపోకుండా ఉండడం, ఉల్లి కోడు, ఎండాకు తెగులు, చీడపీడలను తట్టుకోగలగడం, బరువు కలిగి ఉండడంతో ప్రాచుర్యం పొందింది. గత రబీలో తెలంగాణలో వడగళ్ల వానను సైతం తట్టుకుని ఐకెపి కేంద్రాల్లో ఎ-గ్రేడు ధాన్యంగా ఈ వరి వంగడాన్ని కొనుగోలు చేశారు. పంజాబ్‌లో ఈ రకం 26 శాతం సాగు చేస్తున్నారంటే, దీనికున్న డిమాండ్‌ అర్థం చేసుకోవచ్చు. ఈ రకం ధాన్యాన్ని పారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల్లో మాత్రమే మిల్లింగ్‌ చేయాలి. రా రైస్‌ మిల్లులో ఆడితే నూక శాతం పెరుగుతుంది. ఈ కారణంగా బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు మాత్రమే ఎక్కువగా దీనిని కొనుగోలు చేస్తారు. కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మార్కెటింగ్‌లో తలెత్తే ఇబ్బందుల దృష్టా ఈ రకాన్ని పండించవద్దని రైతులకు సూచించినట్లు వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు.

అనుమతివ్వాలి

జిల్లాలో రైతుల ఆసక్తి మేరకు ప్రభుత్వం ప్రోత్సహించాలి. పిఆర్‌-126 రకం వంగడంతో తక్కువ కాలంలో పంట, అధిక దిగుబడులు వస్తున్నాయి. అధిక శాతం మంది ఈ రకం సాగుకు మక్కువ చూపుతున్నారు. దీని సాగుకు అనుమతించాలి. కొనుగోలులో ఇబ్బందులను అధిగమించి రైతులకు అండగా నిలవాలి. సాగుకు రైతులకు, సలహాలు సూచనలు ఇవ్వాలి.

 – తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు

జిల్లా వాతావారణానికి అనుకూలం కాదు

జిల్లాలోని వాతావరణానికి పిఆర్‌-126 అనుకూలం కాదు. అధిక దిగుబడులు వస్తున్న మాట వాస్తవమే. పంజాబ్‌ వాతావరణానికి అనుకూలంగా ఈ వంగడాన్ని తయారు చేశారు. ఇక్కడి వాతావారణానికి అనుకూలం కాదు. అందరూ ఈ రకం పండిస్తే ధరలూ స్థిరంగా ఉండవు. ఇప్పటికే బోండాలు రకంలో ఇలాంటి సమస్యలు చూశాం. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం. – ఎస్‌.మాధవరావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి

➡️