నీడ లేదు.. నీళ్లు లేవు…

  • మండుటెండలో రెండు పూటలు కష్టపడినా అత్తెసరు కూలి
  • పునరుద్ధరణకు నోచని వేసవి అలవెన్స్‌

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : ఓవైపు మండుటెండ… మరోవైపు ఎండకు మరిగిపోతున్న గునపాలు, పారలు, గమేలాలు… చేతులు పొక్కులెక్కినా, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా పనిచేయాల్సిందే. ఎందుకంటే మాకు ఇంతకు మించి పనిదొరికే పరిస్థితి లేదు.

 ఇదీ గరివిడి మండలం వెదుళ్లవలసకు చెందిన కొన్న భోగయ్య ఆవేదన
కష్టానికి తగ్గ ఫలితం లేదు. రెండు పూటలా పనిచేస్తున్నా రోజుకు రూ.250 కూలి రావడం కష్టంగా ఉంటోంది. ఈ ఏడాది పెంచామన్న కూలి రేటు కన్నా గత ఏడాది రద్దు చేసిన వేసవి అలవెన్సులే ఎక్కువ. ఇంతకు ముందులా పని ప్రదేశంలో నీరు, నీడ వంటి సదుపాయాలు లేవు.

 సీతానగరం మండలం, లక్ష్మీపురానికి చెందిన గునుపూరు శ్రీనివాసరావు ఆక్రోశం
కూలి సొమ్ముతో బతుకీడ్చడం కష్టతరంగా మారుతోంది. మండుటెండలో రెండు పూటలా కష్టపడలేకపోతున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే తిరిగి వలసబాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.

 పూసపాటిరేగ మండలం పేరాపురానికి చెందిన బి.రమణమ్మ ఆవేదన
దాదాపు ఉపాధి కార్మికులందరిదీ ఇదే వ్యథ. ఉపాధి కార్మికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు విజయనగరం జిల్లా పూసపాటిరేగ, గరివిడి, మెంటాడ, దత్తిరాజేరు, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో పని ప్రదేశాలను ‘ప్రజాశక్తి’ సందర్శించింది. దాదాపు అందరూ ఎండ తీవ్రత వల్ల పని కష్టతరంగా మారిందని, రెండు పూటలా పనిచేయలేక పోతున్నామని, తీరా కష్టపడినా అందుకు తగ్గ ఫలితం అందుతుందో, లేదోనని ఆవేదన వ్యక్తం చేశారు. పని ప్రదేశంలో ఇంతకు ముందులా నీరు, నీడ వంటి సదుపాయాలు కల్పించడం లేదంటూ వాపోయారు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పనికి వెళ్లక తప్పడం లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
విజయనగరం జిల్లాలో సుమారు 3.82 లక్షల జాబ్‌ కార్డులు ఉన్నాయి. 3.21 లక్షల కార్డులపై 5.04 లక్షల కూలీలు పనిలోకి వెళ్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31వ వరకు)లో జిల్లాలో 2.10 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొని 1.18 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించారు. అయినా, రాష్ట్రంలో అతి ఎక్కువ పనిదినాలు కల్పించిన జిల్లాగా రికార్డుకెక్కింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి ఆరు నాటికి జరిగిన పనులకుగాను రూ.502.27 కోట్ల మేర వేతన చెల్లింపులు జరిగాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 31వ తేదీ వరకు కల్పించిన పని దినాలకు సంబంధించి మరో రూ.60 లక్షల వరకు కార్మికులకు అందాల్సి ఉంది. 8,076 మంది వికలాంగులు 4,45,400 పనిదినాలు పొందారు. 83.66 శాతం గిరిజన కుటుంబాలకు ఉపాధి పనులు లభించాయి. 65,441 కుటుంబాలవారు వంద రోజుల పనిదినాలు దొరికాయి. గత ఏడాది రోజుకు రూ.272 చొప్పున కూలిరేటు నిర్ణయించగా, ఆచరణలో రూ.250 మించి అందలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రూ.28 పెంచి రూ.300 చేసింది. కూలిరేటు పెంచిన తరువాత ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదని, ఈ దృష్ట్యా ఎంత అందనుందో తెలియడం లేదని కార్మికులు చెప్తున్నారు.

ఉపాధి చట్టానికి కేంద్రం తూట్లు!
కేంద్ర ప్రభుత్వ నిబంధనలు సగటు కుటుంబాల జీవనానికి కీలకంగా మారిన ఉపాధి పనులను దూరం చేస్తున్నాయి. ఉపాధి చట్టానికే తూట్లు పొడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన వల్ల గత ఏడాది నుంచి ఉదయం 6 గంటల నుంచి 10.30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6.30 గంటల వరకు ఉపాధి పనులు చేయాల్సి వస్తోంది. పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచీ సొంతంగా పార, గునపాం, తట్టలు తెచ్చుకున్నందుకు రోజుకు రూ.5 చొప్పున అద్దె చెల్లించేవారు. మార్చి ఏప్రిల్‌, మే నెలల్లో వారానికి రూ.20 చొప్పున వేసవి అలవెన్స్‌లు అదనంగా అందేవి. పని ప్రదేశంలో కార్మికులకు తాగునీరు, నీడ సదుపాయం కల్పించేందుకు నిధులు కేటాయించేవారు. గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. దీనిపై అధికారులను ప్రశ్నించగా, గతంలో స్టేట్‌ సర్వర్‌ సెంటర్‌ (ఎస్‌టిసి)లో అద్దెలు, అలవెన్సుల నమోదుకు అవకాశం ఉండేదని, ఎస్‌టిసి స్థానంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్‌లో వాటి నమోదుకు అవకాశం లేదని చెబుతున్నారు.

➡️