భారత్‌లో ప్రవేశిస్తున్న మయన్మార్‌ సైనికులు

మిజోరం : మయన్మార్‌ లో అంతర్యుద్ధం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఆ దేశానికి చెందిన వందలాది సైనికులు పారిపోయి భారతదేశంలోకి వస్తున్నారు. మయన్మార్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే మిజోరం కేంద్రాన్ని అభ్యర్థించింది.

మయన్మార్‌లో 2021వ సంవత్సరంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి సైనిక పాలకులు అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి విదితమే. ప్రజాస్వామ్య అనుకూల వర్గాలు పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలతో దేశంలో అంతర్యుద్ధం నెలకొంది. దీంతో మయన్మార్‌ ఆర్మీకి చెందిన వందలాదిమంది సిబ్బంది మిజోరం సరిహద్దుల ద్వారా భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఈ పరిణామాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది. వారిని తిరిగివెంటనే వెనక్కి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

భారతదేశంలో ప్రవేశించిన 600 మంది మయన్మార్‌ సైనికులు….

మయన్మార్‌లో మిలటరీ పాలనను వ్యతిరేకిస్తూ … ప్రజాస్వామ్య అనుకూలవాదులతో కూడిన సాయుధ బఅందాలు కూటములుగా ఏర్పడి పోరాడుతున్నాయి. ఈ ఘర్షణల వల్ల ఇప్పటివరకు 600 మంది మయన్మార్‌ సైనికులు సరిహద్దులు దాటి భారతదేశంలోకి ప్రవేశించారు. రెబల్‌ గ్రూప్‌ అరాకన్‌ ఆర్మీ తమ శిబిరాలను స్వాధీనం చేసుకోవడంతో వారంతా మిజోరంలోని లాంగ్‌ట్లాయ్ జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అస్సాం రైఫిల్స్‌ క్యాంపుల్లో వారు ఉంటున్నట్లు తెలుస్తోంది.

400మందిని వెనక్కు పంపేశాం : సిఎం లాల్‌దుహోమా

ప్రస్తుత జరుగుతున్న ఈ పరిస్థితులపై ముఖ్యమంత్రి లాల్‌దుహౌమా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో చర్చించారు. ” ఆశ్రయం పొందేందుకు మయన్మార్‌ నుంచి ప్రజలు మనదేశంలోకి ప్రవేశిస్తున్నారు. మానవతా దృక్పథం కింద మేం వారికి సాయం చేస్తున్నాం. ఆ దేశం నుంచి సైనికులు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే 400 మందిని వెనక్కి పంపించేశాం ” అని సమావేశం అనంతరం సిఎం మీడియాకు వెల్లడించారు.

శక్తివంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థలు..

మయన్మార్‌లో జరుగుతున్న దాడుల్లో ‘త్రీబ్రదర్‌హుడ్‌ అలయన్స్‌ (టీబీఏ)’ కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో మయన్మార్‌ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (ఎంఎన్‌డీఏఏ), టాంగ్‌ జాతీయ విమోచన సైన్యం(టీఎన్‌ఎల్‌ఏ), అరాకన్‌ ఆర్మీ(ఏఏ) భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దేశంలో అత్యంత శక్తివంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థలుగా వీటికి పేరుంది.

➡️