కాంగ్రెస్‌ను ఐటి నోటీసులు

Mar 30,2024 08:37 #Congress, #Income Tax department

రూ. 1823 కోట్లకు ఐటి డిమాండ్‌ నోటీసులు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆదాయపు పన్ను (ఐటి) విభాగం కాంగ్రెస్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది. గత సంవత్సరాల్లో పన్ను రిటర్స్‌ల్లో వ్యత్యాసాల కారణంగా రూ.1823 కోట్ల డిమాండ్‌ నోటీసులు ఈ వారం ప్రారంభంలో జారీ చేసింది. ఈ విషయాన్ని పార్టీ కోశాధికారి అజరు మాకెన్‌, ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ శుక్రవారం మీడియా సమవేశంలో తెలిపారు. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పన్ను రిటర్స్‌ల్లో వ్యత్యాసాల కారణంగా ఈ తాజా నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. ‘ఆదాయపన్ను శాఖ నుంచి కాంగ్రెస్‌కు రూ. 1823 కోట్ల డిమాండ్‌ నోటీసు వచ్చింది. కేవలం సీతారాం కేసరి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోని 1993-94 ఏడాదికే డిమాండ్‌ను రూ. 53 కోట్లకు పెంచారు’ అనిఎఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అజరు మాకెన్‌ తెలిపారు. ‘ఆదాయపన్ను శాఖ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతుంది. బిజెపి రూ. 4,600 కోట్ల పెనాల్టీ చెల్లించాలి’ అని అన్నారు. ఈ విషయంలో వచ్చే వారం ప్రారంభంలో సుప్రీంకోర్టును కాంగ్రెస్‌ ఆశ్రయిస్తుందని చెప్పారు. బిజెపి ట్యాక్స్‌ తీవ్రవాదానికి పాల్పడుతుందనిజైరాం రమేష్‌ ఆరోపించారు.

➡️