గుజరాత్‌ బిజెపిలో లుకలుకలు !

Apr 2,2024 00:10 #BJP, #Gujarat
  • అభ్యర్థుల ఎంపికలో అధిష్టానానికి తలనొప్పులు
  • బాహాటంగానే అసంతృప్తుల వెల్లడి

అహ్మదాబాద్‌ : అభ్యర్థుల ఎంపికపై గుజరాత్‌లో బిజెపి నిరసనలు, ఆందోళనలను ఎదుర్కొంటోంది. అమ్రేలీలో సిట్టింగ్‌ ఎంపి నారాన్‌ కచ్చదియాకు బదులుగా భారత్‌ సుతారియాను అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. సబరికాంత అభ్యర్ధి విషయంలో కూడా కార్యకర్తలు అసంతృప్తిగానే వున్నారు. మాజీ సంస్థానాల కుటుంబాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బిజెపి అభ్యర్ధి పురుషోత్తమ్‌ రూపాలాకు వ్యతిరేకంగా క్షత్రియులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసనలు కొనసాగుతుండగానే అమ్రేలీలో అభ్యర్థిత్వంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. సిట్టింగ్‌ ఎంపి నారాన్‌ కచ్చదియా, కొత్త అభ్యర్థి భారత్‌ సుతారియిల మద్దతుదారులు బాహాటంగానే తలపడడంతో పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరు బయటపడింది. ఈ ఘర్షణల్లో గాయపడి అనేకమంది స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి వెళ్ళి కచ్చదియా వారిని పరామర్శించారు. తమ నాయకుడిని తొలగించినందుకు ఆయన మద్దతుదారులు తీవ్రంగా కలవరం చెందుతున్నారని స్థానిక నేత ఒకరు వ్యాఖ్యానించారు. కచ్చదియా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాను ఎంతలా ప్రజల కోసం పనిచేసినా అది గుర్తించకుండా తనను మారుస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన అసంతృప్తిగా వున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2009 నుండి ఆయన ఎంపీగా వున్నారు.
సుతారియా పార్టీ అభ్యర్థిగా వుంటారని మాజీ మంత్రి, ఇన్‌ఛార్జి భూపేందర్‌ సింగ్‌ చుదసామా ప్రకటించిన వెంటనే రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. పాలక పార్టీ రాష్ట్రంలో అభ్యర్థులను ప్రకటించగానే ఇంతలా ఘర్షణలు, నిరసనలు వ్యక్తమవడం ఇదే మొదటిసారి. వడోదర, సబరకాంతలకు కూడా పార్టీ కొత్త అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది. స్థానిక కార్యకర్తల నుండి నిరసనలు వ్యక్తం కావడంతో నామినీలు ఎన్నికల బరి నుండి వైదొలగాల్సి వచ్చింది. అమ్రేలీలో ఘర్షణల గురించి బిజెపి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. విభేదాలను పరిష్కరించేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నా నిరసనలు ఆగడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
కులతత్వంతో అర్హులైన అభ్యర్థులకు అవకాశాలు వుండడం లేదని బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు భరత్‌ కనబార్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. దీనికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాలను కూడా ట్యాగ్‌ చేశారు. ”కులతత్వం అనే భయంకరమైన బాంబు దాడితో యోగ్యత అనేది దెబ్బతింటోంది. ఈ సీటు కోలిలకు, ఈ సీటు పటేల్‌లకు, ఈ సీటు థాకూర్‌లకు లేదా అహిర్‌లకు లేదా క్షత్రియులకు అని కేటాయిస్తూ పోతే అర్హులైన అభ్యర్థులకు అంటూ ఒక్క సీటైనా కేటాయించబడుతుందా?” అని ఆయన ఆ పోస్టులో ప్రశ్నించారు.
సబరకాంతలో పార్టీ కొత్త అభ్యర్ధిని నామినేట్‌ చేసినప్పటికీ, కాంగ్రెస్‌ మాజీ ఎంఎల్‌ఎల భార్య శోభనా బరయాను ఎంపిక చేయడంపై స్థానిక కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ సబరకాంత స్థానిక కార్యకర్తలతో పెద్ద సమావేశాన్ని నిర్వహించారు. స్థానికులు మాత్రం అభ్యర్థి మార్పు పట్ల మొండిగానే వ్యవహరిస్తుండడంతో పరిష్కారం లభించలేదు. మాజీ కాంగ్రెస్‌ నేత భార్యను నిలబెట్టే బదులు బిజెపికి చెందిన ఏ కార్యకర్తనైనా పెట్టాల్సిందేనని వారు పట్టుబడుతున్నారని స్థానిక నేత ఒకరు తెలిపారు.

➡️