చీలికల పోరుతో ‘మహా’ ఉత్కంఠ

  • మహాయితి, మహావికాస్‌ మధ్య పోటీ
  • 11 స్థానాలకు 7న పోలింగ్‌

శివసేన, ఎన్‌సిపిల్లో చీలిక నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మే 7న జరగబోయే మూడోవిడత ఎన్నికల్లో 11 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బారామతి (పవార్‌ల మధ్య పోటీ), రత్నగిరి-సింధుదుర్గ్‌ (రాణేల మధ్య పోటీ), సోలాపుర్‌ (షిండేల మధ్య), రాయగడ్‌ (ఠాకుర్‌ల మధ్య)లలో పోటీ నెలకొనడంతో ఈ స్థానాల్లో గెలుపుపై ఆసక్తి నెలకొంది. అధికార మహాయితి కూటమి (బిజెపి, షిండే శివసేన, అజిత్‌ పవార్‌ ఎన్‌సిపి) రాష్ట్రంలోని మొత్తం స్థానాలను గెలుపొందాలని చూస్తోంది. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడి కూటమిలో శరద్‌ పవార్‌ ఎన్‌సిపి బారామతి, మధా, సతారా నియోజకవర్గాల్లోనూ, ఉద్ధవ్‌ శివసేన పార్టీ రత్నగిరి-సింధుదుర్గ్‌, రాయగడ్‌, ధరశివ్‌ స్థానాలో కాంగ్రెస్‌ లాతుర్‌, షోలాపూర్‌, కోల్హపూర్‌ సంఘిల్‌లోనూ పోటీ చేస్తున్నాయి.

రాయగడ్‌ నియోజకవర్గంలో ఎన్‌సిపి (అజిత్‌ పవార్‌) సిట్టింగ్‌ ఎంపి సునీల్‌ ఠాక్రేకి పోటీగా శివసేన (ఉద్ధవ్‌) అభ్యర్థి అనంత్‌ గీతే బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతో అనంత్‌ ఓడిపోయారు. ఈసారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోలాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బిజెపిల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ నుంచి ప్రణీతి షిండేకి పోటీగా బిజెపి రామ్‌ సాత్పేతే బరిలో నిలిచారు. సిట్టింగ్‌ ఎమ్మేల్యే, మాజీ సిఎం సుశీల్‌కుమార్‌ షిండే కుమార్తె ప్రణీతి. 2019లో బిజెపి 48 శాతం ఓట్లు తెచ్చుకొని గెలుపొందారు. ఈ సీటు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

శివాజీ వారసులకు టికెట్లు
సతారా, కొల్హాపుర్‌ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌, బిజెపిలు శివాజీ వారసులను బరిలోకి దించాయి. కొల్హాపుర్‌లో కాంగ్రెస్‌ నుంచి శాహూ (చత్రపతి 13వ వారసుడు) బరిలో దిగారు. షిండే నుంచి సంజరు మండ్లిక్‌ బరిలో నిలిచారు. సతారాలో బిజెపి నుంచి ఉద్యాంరాజే భోస్లే ( శివాజీ 12వ వారసుడు) పోటీ చేస్తున్నారు. ఎన్‌సిపి (శరద్‌ పవార్‌) నుంచి శశికాంత్‌ షిండే పోటీ చేస్తున్నారు. కొల్హాపుర్‌లో కాంగ్రెస్‌కు ఎంఐఎం మద్దతు ప్రకటించింది. కొంకణ్‌లో కీలకమైన రత్నగిరి-సింధుదుర్గ్‌లో రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన శివసేన (ఉద్ధవ్‌) అభ్యర్థి వినాయక్‌ రౌత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ముంబాయి-గోవా హైవే, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ వంటి అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటుతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. శివసేన (షిండే) పార్టీకి ఇక్కడ గెలుపు కష్టతరమవ్వనుందని చెబుతున్నారు. నిరుద్యోగం, రైతు ఆదాయం పతనం వంటి స్థానిక సమస్యలు బిజెపికి ఇబ్బందికరండగా తయారయ్యాయి. మోడీ తరుచుగా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పటికీ పార్టీల మధ్య అంతర్గతంగా పొడసూపిన తగాదాలు బిజెపికి ప్రతిబంధకంగా మారింది. ముస్లింలకు ఒబిసి రిజర్వేషన్‌ కల్పిస్థామనడంతో కాంగ్రెస్‌కు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది.

బారామతిపై దేశం దృష్టి
ముంబయి : మహారాష్ట్రలోని బారమతి లోక్‌సభ నియోజవర్గ ఎన్నిక దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నెల 7న పోలింగ్‌ జరిగే ఈ నియోజవర్గం నుంచి ఎన్‌సిపి వ్యవస్థాపకులు శరద్‌ పవార్‌ కుటుంబానికి చెందిన వ్యక్తులే పోటీలో ఉండటమే ఇందుకు కారణం. గత ఏడాది జులైలో ఎన్‌సిపిని చీల్చిన శరద్‌ పవార్‌ సోదరుడి కుమారుడు అజిత్‌ పవార్‌ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలోకి చేరిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి పదవీని అందుకున్నాడు. ప్రస్త్తుత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మహా వికాస్‌ అఘాఢి (ఎంవిఎ) కూటమి అభ్యర్థిగా, ఎన్‌సిపి (శరద్‌ పవార్‌) నుంచి శరద్‌ పవార్‌ కుమార్తె, ప్రస్తుత ఎంపి సుప్రియా సులే పోటీలో ఉన్నారు. మరోవైపు అధికార ఎన్‌డిఎ కూటమి అభ్యర్థిగా అజిత్‌ పవార్‌ భార్య సునేత్ర పవార్‌ పోటీలో ఉన్నారు. వరసకి వదినా మరదళ్లు అయ్యే వీరద్దరి మధ్య పోటీ దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. బారమతి లోక్‌సభ పరిధిలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు కాగితాలపై చూస్తే ఈ లోక్‌సభ నియోజవర్గంలో అజిత్‌ పవార్‌దే పై చేయి. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఎన్‌సిపి (శరద్‌పవార్‌)కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. అయితే సుప్రియా సులే మాత్రం తన గెలుపుపై మంచి నమ్మకంతో ఉన్నారు. తన తండ్రి చరిష్మా, ఎంవిఎ కూటమికి ఉన్న ఆదరణ తనని గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. ప్రస్తుత ఎంపిగా తాను చేసిన మంచి పనులు కూడా తనను విజయం వైపు నడిపిస్తాయని ఆమె చెబుతున్నారు. ఎన్‌సిపిని చీల్చినందుకు అజిత్‌ పవార్‌పై ప్రజల్లో ఉన్న ఆగ్రహాం కూడా తనకు కలిసి వస్తుందని నమ్ముతున్నారు. అయితే మరోవైపు అజిత్‌ పవార్‌ కూడా తన భార్య తరుపున తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. సునేత్ర పవార్‌ను గెలిపిస్తే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు రాబడతానని అంటున్నారు. గత ఐదేళ్లలో సుప్రియా ఈ నియోజకవర్గానికి చేసిందీ ఏదీ లేదని విమర్శిస్తున్నారు. ఏదీ ఏమైనా బారామతి ఎన్నికల ఫలితం అజిత్‌ పవర్‌ అతని రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్‌సిపిని చీల్చి బయటకు వచ్చిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తేనే అతని రాజకీయ మనుగడ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. దీంతో బిజెపి, ఎన్‌డిఎ కూటమిలో నేతలు బారామతిలో జరుగుతున్నది పవార్‌ కుటంబం మధ్య లేదా వదినా మరదళ్ల మధ్య పోటీయో కాదని, నరేంద్ర మోడీ, రాహుల్‌ గాంధీ మధ్య జరుగుతున్న పోటీ అని అంటున్నారు. అయితే ఈ మాటలను ప్రజలను నమ్మడం లేదు.

-ఎలక్షన్‌ డెస్క్‌

➡️