Delhi : నేడు, రేపు ఢిల్లీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు : ఐఎండి

Jun 29,2024 12:36 #Delhi, #rains

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని నిన్న మొన్నటి వరకు ఎండలు వణికించాయి. ఇప్పుడు కుండపోత వర్షాలు కురిసి తడిసిముద్ద చేస్తున్నాయి. ఢిల్లీ అంతటా ఈరోజు, రేపు (29,30) ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. దీంతో ఢిల్లీ చిరుగురుటాకులా వణికిపోతోంది. ఢిల్లీని నైరుతి రుతుపవనాల రాకతో గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మూడు నెలల్లో కురవాల్సిన వర్షం కంటే ఎక్కువ కేవలం 24 గంటల్లోనే కురిసిందని ఐఎండి ప్రకటించింది. 1936 తర్వాత ఈ నెల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ వెల్లడించింది.

కాగా, ఢిల్లీలో కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. శుక్రవారం ఉదయం కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఎంపీలు, మంత్రుల ఇళ్లలోకి నీరు చేరడంతో.. పార్లమెంటు సమావేశాలకు వెళ్లడానికి కూడా కష్టాలు పడుతున్నారు.

➡️