బిజెపితో జెజెపి కటీఫ్‌

ఖట్టర్‌ రాజీనామా…నాయబ్‌ సైనీ ప్రమాణస్వీకారం
హర్యానాలో నాటకీయ పరిణామాలు
చండీగఢ్‌: లోక్‌సభ ఎన్నికల వేళ ఎన్‌డిఎకు మరో మిత్రపక్షం దూరమైంది. హర్యానాలో బిజెపితో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న జననాయక్‌ జనతా పార్టీ (జెజెపి) ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో హర్యానాలో మంగళవారం అనూహ్య నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన బిజెపి, జెజెపి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ప్రభుత్వం రాజీనామా చేసింది. కురుక్షేత్ర ఎంపీ, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నాయబ్‌ సైనీని బిజెపి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. ఆయన వెంటనే రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. సాయంత్రం సైనీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సైనీ చేత గవర్నర్‌ దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో ఓ స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మొత్తంమీద స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కమలదళం తన ప్రభుత్వాన్ని కాపాడుకుంది.
బిజెపి, జెజెపికి చెందిన ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌతాలా మధ్య సంబంధాలు బెడిసికొట్టడంతో సంకీర్ణ ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరకపోవడమే ఈ పరిణామాలకు కారణమని తెలుస్తోంది. స్వతంత్రుల మద్దతుతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఖట్టర్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అధిష్టానం ఆదేశాలతో బిజెపి నాయకులు అర్జున్‌ ముండా, తరుణ్‌ చుగ్‌ హుటాహుటిన హర్యానా వెళ్లారు. ఆ తర్వాత బిజెపి శాసనసభాపక్షం సమావేశమై సైనీని నేతగా ఎన్నుకుంది. అంతకుముందు ఈ రెండు పార్టీలు వేర్వేరుగా తమ తమ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించాయి. ఖట్టర్‌ తన నివాసంలో మంత్రులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారితో సహా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించారు.
90 మంది ఎమ్మెల్యేలు ఉన్న హర్యానా శాసనసభలో బిజెపికి 41 మంది సభ్యులు ఉన్నారు. జెజెపికి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శాసనసభకు ఎన్నికైన ఏడుగురు స్వతంత్రుల్లో ఆరుగురు బిజెపికి మద్దతు ఇస్తున్నారు. దీంతో జెజెపి మద్దతు లేకపోయినా స్వతంత్రుల సాయంతో బిజెపి తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు 30 మంది, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌, హర్యానా లోక్‌హిత్‌ పార్టీలకు ఒక్కో సభ్యుడు ఉన్నారు. బిజెపి శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత సైనీ ఎక్స్‌లో స్పందించారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా, బిజెపి అధ్యక్షుడు నడ్డా, మాజీ ముఖ్యమంత్రి ఖట్టర్‌, పార్టీ ఎమ్మెల్యేలు, మద్దతు ఇచ్చిన స్వతంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించేందుకు జెజెపి బుధవారం హిస్సార్‌లో ర్యాలీ నిర్వహిస్తోంది. తద్వారా తన బలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమైంది. బిజెపి తన నైతిక పరాజయాన్ని అంగీకరించిందని, ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత భూపేందర్‌ సింగ్‌ హూడా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన
లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి బిజెపి, జెజెపి మధ్య జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. రాష్ట్రంలో పది లోక్‌సభ స్థానాలు ఉండగా జెజెపి రెండు సీట్లను కోరింది. ఇందుకు బిజెపి ససేమిరా అంది. హిస్సార్‌, భివానీ-మహేంద్రఘర్‌ లోక్‌సభ స్థానాల కోసం జెజెపి పట్టుబట్టింది. అయితే మొత్తం 10 సీట్లలోనూ తానే పోటీ చేస్తానని బీజేపీ తెగేసి చెప్పింది. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, జేజేపీ కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని జేజేపీ నేత దుష్యంత్‌ చౌతాలా స్పష్టం చేశారు. ఆయన సోమవారం ఢిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమయ్యారు. తన పార్టీ వైఖరిని తెలియజేశారు. దానికి కొద్ది గంటల ముందే దుష్యంత్‌, మోడీ ఓ కార్యక్రమంలో వేదికను పంచుకోవడం గమనార్హం. దుష్యంత్‌, అమిత్‌ షా మధ్య మంగళవారం ఉదయం సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ జరగలేదు.

➡️