Bihar Lok Sabha polls : – బీహార్‌లో కుదిరిన ‘ఇండియా’ సీట్ల సర్దుబాటు

– ఖగారియా నుంచి సిపిఎం
ఆర్‌జెడి 26.. కాంగ్రెస్‌ 9.. వామపక్షాలు 5 సీట్లలో పోటీ
పాట్నా : పద్దెనిమిదో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీహార్‌లో ‘ఇండియా’ వేదిక భాగస్వాముల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. రాష్ట్రంలోని మొత్తం 40 లోక్‌సభ సీట్లకు గాను ఆర్‌జెడి 26 స్థానాల్లో పోటీ చేయనుండగా, కాంగ్రెస్‌ా9, వామపక్షాలు ఐదు స్థానాల్లో పోటీచేయనున్నాయి. ఖగారియా స్థానాన్ని సిపిఐ(ఎం) కు కేటాయించగా, బెగుసరారు స్థానాన్ని సిపిఐకి, ఆరా, కరకట్‌, నలందా స్థానాలను సిపిఐ(ఎంఎల్‌)కు కేటాయించారు. ఇండియా బ్లాక్‌లోని భాగస్వామ్య పార్టీల నేతలు శుక్రవారం నాడిక్కడ విలేకరుల సమావేశం లో ఈ సీట్ల సర్దుబాటు గురించి ప్రకటించారు.జెడి(యు) సిట్టింగ్‌ స్థానాలైన పూర్ణియా, కటిహార్‌ సీట్ల విషయమై ఆర్‌జెడి, కాంగ్రెస్‌ల మధ్య ప్రతిష్టంభన తొలగిపోయింది. పూర్ణియాను ఆర్‌జెడికి కాంగ్రెస్‌ వదులుకున్నది. అయితే, ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఇటీవలే కాంగ్రెస్‌లో తన పార్టీ జన్‌ అధికారి పార్టీ (జెఎపి)ని విలీనం చేసిన పప్పు యాదవ్‌ పట్టుబట్టారు.. ఆయన ఆ సీటును వదులుకోవటానికి సిద్ధంగా కనిపించటం లేదు.
ఎన్డీయేలోని కూటమిలో బిజెపి 17, జెడియు 16, జీతన్‌రామ్‌ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం) 1, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) 1, చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) మిగిలిన ఐదు స్థానాల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో కాంగ్రెస్‌ ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. ఆర్‌జెడి ఖాతా తెరవలేదు. బిజెపి 17, జెడియు 16 సీట్లను గెలుచుకున్నాయి. బీజేపీకి దక్కిన ఓటింగ్‌ శాతం 24.1 కాగా, జేడీయూ 22.3 శాతం ఓట్లను పొందింది. అవిభాజ్య ఎల్జేపీ ఆరు ఎంపీ సీట్లతో 8 శాతం ఓట్లను కైవసం చేసుకున్నది. కాంగ్రెస్‌ 7.9 శాతం ఓట్లను మాత్రమే పొందింది.
నితీశ్‌ జేడీయూ తిరిగి ఎన్డీయే కూటమిలోకి చేరటంతో రాష్ట్రంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఇటు కేంద్రంలోని మోడీ సర్కారు మహాఘట్‌బంధన్‌ను విడగొట్టిన తీరునూ అక్కడి ప్రజలు గమనించారనీ, ఈ విషయం అక్కడి ఓటర్లపై ప్రభావం చూపనున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్పారు.

➡️