Kejriwal arrest : ప్రజాస్వామ్యం ఖూనీ : గెహ్లాట్‌

జైపూర్‌ : లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఇడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ కేంద్ర ప్రభుత్వాన్ని, ఇడి దర్యాప్తు సంస్థని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మోడీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం గెహ్లాట్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎలాంటి రుజువు లేకుండానే కేజ్రీవాల్‌పై దర్యాప్తు సంస్థ చర్యలు తీసుకుంది. సిట్టింగ్‌ సిఎంని అరెస్టు చేసిన తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఈ వ్యక్తులు ప్రజలచే ఎన్నుకోబడ్డారు. వారేమన్నా హత్య చేశారా? లేదా తీవ్రమైన నేరానికి పాల్పడ్డారా? లేదా వారెక్కడికైనా పారిపోయారా? వారెమన్నా ప్రజలను ప్రభావితం చేస్తున్నారా?’ అని గెహ్లాట్‌ ప్రశ్నించారు. ఎలాంటి రుజువు లేకుండా, పూర్తిగా ఒకరి ప్రకటనల ఆధారంగా ఇడి అధికారులు చర్యలు తీసుకున్నారని గెహ్లాట్‌ విమర్శించారు. అయితే కేజ్రీవాల్‌ అరెస్టుతో ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయా లేదా అని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని గెహ్లాట్‌ అన్నారు.

➡️