Nyay Patra: ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాసిన ఖర్గే

న్యూఢిల్లీ :    కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ ‘న్యారుపత్ర్‌’ను వివరించేందుకు వీలుగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖను కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేష్‌ గురువారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

యువత, మహిళలు, రైతులు, కార్మికులు, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రజలకు న్యాయం కల్పించడమే కాంగ్రెస్‌ న్యారుపత్ర్‌ లక్ష్యమని ఖర్గే పేర్కొన్నారు. న్యారు పత్రాన్ని వివరించేందుకు ప్రధాని కలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రధాని సలహాదారులు ఆయనకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. సందర్భానుసారంగా కాంగ్రెస్‌ పేర్కొన్న కొన్ని పదాలను ప్రధాని మోడీ మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు వినియోగిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

మొదటి దశ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బిజెపి నేతలు ఈవిధంగా వ్యాఖ్యానిస్తారని ఊహించామని ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ధనవంతులు, పేదల గురించి వ్యాఖ్యానించినప్పుడల్లా.. ప్రధాని ఆ వ్యాఖ్యలను హిందూ- ముస్లింలకు సమానం చేస్తారని అన్నారు. బిజెపి సూట్‌-బూట్‌ కీ సర్కార్‌ అని పునరుద్ఘాటించారు.

ప్రధాని ‘మంగళసూత్ర ‘ ఆరోపణలపై స్పందిస్తూ.. పేద, వెనుకబడిన వర్గాల మహిళలు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై బిజెపి స్పందించకుండా పదేపదే తప్పించుకుంటుందని పేర్కొన్నారు. మణిపూర్‌లో మహిళలపై , దళిత బాలికలపై అఘాయిత్యాలకు అడ్డుకోవడం మీ ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. రేపిస్టులకు పూలమాలలు వేసి స్వాగతిస్తారా అని నిలదీశారు. మీ ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడినపుడు మీరు తీసుకున్న చర్యలేమిటని, వారి కుటుంబాలకు ఎలా రక్షణ కల్పిస్తున్నారని ఆ లేఖలో ప్రశ్నించారు.

➡️