‘వైకోం’ శతాబ్ది సావనీర్‌ ఆవిష్కరణ

satyagraha utsavam vaikom savanir manik sarkar

 

చెన్నై : కుల వివక్షకు వ్యతిరేకంగా సాగిన వైకోం సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సావనీర్‌ను కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు పినరయి విజయన్‌, ఎంకె స్టాలిన్‌ ఆవిష్కరించారు. తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యాన గురువారం చెన్నైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పినరయి విజయన్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ద్రవిడ కజగమ్‌ అధ్యక్షులు కె.వీర మణి, మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నా రు. షెడ్యూల్‌ ప్రకారం ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించాల్సి ఉన్నా.. సోమవారం ఉదయం ప్రముఖ నటులు, డిఎండికె వ్యవస్థాపకులు విజరుకాంత్‌ మరణించడంతో సాదాసీదాగా నిర్వ హించారు. 1924లో అప్పటి ట్రావెన్‌కోర్‌ రాజ్యంలో ఉన్న వైకోం ఆలయ ప్రవేశం కోరుతూ శాంతియుతం గా, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఆందోళన ‘వైకోం సత్యాగ్రహం’గా పేరుగాంచింది. ఇవి రామసామి పెరియార్‌ నేతృత్వంలోని ఈ సాగిన ఆందోళనకు ట్రావెన్‌కోర్‌ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.

  • దేశానికే ఆదర్శంగా వైకోం సత్యాగ్రహం : విజయన్‌

కుల వివక్షకు వ్యతిరేకంగా జరిగిన వైకోం సత్యాగ్రహం తరువాత కాలంలో దేశంలోని అనేక ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచిందని కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ తెలిపారు. ఈ సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినందుకు తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను అభినందిస్తూ విజయన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. భారతదేశ చరిత్రలోనే అపూర్వమైన ప్రజా ఉద్యమంగా ‘వైకోం సత్యాగ్రహం’ను విజయన్‌ అభివర్ణించారు. కేరళీయుల గురించి తమిళ సోదరులు ఎంత గర్వపడుతున్నారో చెప్పడానికి చెన్నై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వేడుక ఒక నిదర్శమని అన్నారు. కేరళలో అనేక పునరుజ్జీవనోద్యమాలు జరిగినా వీటిల్లో వైకోం సత్యాగ్రహం ఒక ముఖ్యమైనదని, ప్రత్యేకమైనదని అన్నారు. కుల వ్యవస్థ, ఆర్య ఆధిపత్యం, బ్రాహ్మణ ఆధిపత్య దురాచారాలకు వ్యతిరేకంగా, ధైర్యంగా పోరాడిన పెరియార్‌ ఇవి రామస్వామి ఈ చారిత్రక పోరాటంలో పాల్గొనడానికి కేరళ వచ్చారన్న చారిత్రక వాస్తవాన్ని తమ రాష్ట్రం ఎప్పుడూ గర్వంగా గుర్తు చేసుకుంటుందని తెలిపారు. ఈ ఉద్యమం తరువాతే పెరియార్‌కు ‘వైకోం వీరర్‌’ బిరుదు వచ్చిందని గుర్తు చేశారు. ఈ సత్యాగ్రహంతోనే కాకినాడలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో అస్పృశ్యత నిర్మూలన, ఆలయ ప్రవేశానికి అనుకూలంగా తీర్మానం చేశారని తెలిపారు. వివిధ కులాల వారితో సహా వివిధ మతాల వారు ఈ ఉద్యమంలో పాల్గొన్నారని, ఇది ప్రజా ఉద్యమమని పేర్కొన్నారు.

➡️