తృణమూల్‌ దాదాగిరి.. తిప్పికొట్టిన ప్రజలు

May 8,2024 08:47 #Trinamool Dadagir

– చాలా చోట్ల ఏడేళ్ల తరువాత
ఓటు వేసే అవకాశం లభించింది.
– మహ్మద్‌ సలీం
కొల్‌కతా : దేశంలో, అలాగే బెంగాల్‌లో శాంతి, సామరస్యాలకు ముప్పుగా పరిణమించిన శక్తులను ఓడించాలన్న తమ పిలుపునకు ప్రజలు సరిగానే స్పందించారని ముర్షిదాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం అన్నారు. మూడో విడత పోలింగ్‌ ముగిసిన అనంతరం సలీం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, మేము కమిషన్‌ నుండి స్వేచ్ఛా, శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికలను కోరుకున్నాము. తణమూల్‌ కాంగ్రెస్‌ వారు చాలా చోట్ల మా పోలింగ్‌ ఏజెంట్లను బెదిరించారు. గందరగోళం సృష్టించేందుకు యత్నించారు. తనను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల తణమూల్‌ దుండగులను ప్రజలే ప్రతిఘటించారు. ఏడేళ్ల తర్వాత చాలా చోట్లప్రజలు ఓటు వేయగలిగారు. నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో సగటు 73.93 శాతం ఓట్లు పోలైనట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలిసింది. పోలింగ్‌ శాతం ఇంకా పెరిగే అవకాశముందని ఆయన అన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసులు పంచాయతీ ఎన్నికల్లో పక్షపాతంగా వ్యవహరించడం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అక్రమాలు పెద్దయెత్తున చోటుచేసుకున్నాయి. తృణమూల్‌ హింసకు చాలా మంది బలయ్యారు అని సలీం గుర్తు చేశారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించే శక్తులకు, వాటిని నాశనం చేయాలని చూసే శక్తులకు మధ్య పోరాటంగా ఈ ఎన్నికలను చూడాలని మేము ప్రజలను కోరాము. కరీంపూర్‌ సాయుధులైన తృణమూల్‌ గూండాలను తిప్పికొట్టిన ప్రజలను సలీం అభినందించారు. ఇవిఎంలను సరిగ్గా సీల్‌ చేసి, , స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రంగా ఉండేలా చూడాలని ఆయన కోరారు. ఓట్ల లెక్కింపునకు ఇంకా చాలా సమయం ఉన్నందున ఇవిఎంల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ”ప్రధాని ముఖ్యమంత్రుల నకిలీ డిగ్రీలు, నకిలీ టీకాలు, నకిలీ అధికారులను చూశాం. ఈ ఎన్నికల్లో నకిలీ పోలింగ్‌ ఏజెంట్లను కూడా చూశాము. చాలా చోట్ల నకిలీ ఏజెంట్లను తాను స్వయంగా పట్టుకుని పోలీసులకు అప్పగించానని అన్నారు..

➡️