జర్నలిస్టుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభ కవరేజీకి వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడి చేసిన వైసిపి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విలేకరులు నిరసన తెలిపారు. తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌), ఆంధ్రప్రదేశ్‌ బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ (ఎపిబిజెఎ) ఆధ్వర్యాన ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావుకు వినతిపత్రం అందజేశారు. ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు షేక్‌ ఖాజావలి, ఎపిబిజెఎ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.వి.రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ, అనంతపురం, కడప, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, నెల్లూరులో నిరసన తెలిపారు. తిరుపతి, చిత్తూరుల్లో గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమానికి సిపిఎం, సిపిఐ నేతలు సంఘీభావం ప్రకటించారు. పలమనేరులో మాజీ మంత్రి అమరనాథరెడ్డి మద్దతు తెలిపారు. ఏలూరులో జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని అదనపు ఎస్‌పి స్వరూపరాణిని కలిసి వినతిపత్రం అందించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అంబేద్కర్‌ కూడలి నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహశీల్దార్‌ వినతిపత్రం అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, తాళ్లపూడి తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నాలు నిర్వహించారు.

➡️