ఎపి ఎడ్‌ సెట్‌, పిజి సెట్‌ ఫలితాలు విడుదల – బాలికలదే పైచేయి

Jun 27,2024 22:50 #– 2024 Results, #EDCET, #Exams, #relesed

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :రాష్ట్రవ్యాప్తంగా బిఇడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌ – 2024 ప్రవేశ పరీక్షా ఫలితాలను గురువారం ఉదయం విశాఖలోని ఎడ్‌సెట్‌ కార్యాలయంలో పరీక్షల నిర్వహణా కన్వీనర్‌ ఆచార్య టి.వెంకటకృష్ణ విడుదల చేశారు. ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల పరిధిలో 52 పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించారు.10805 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 9365 మంది హాజరయ్యారు. వారిలో 9183 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణతా శాతం 98.05గా నమోదైంది. మొదటి 10 ర్యాంకులు సాధించిన వారిలో ఎనిమిది మంది అమ్మాయిలు ఉండగా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. మెథడాలజీ వారీగా ఫలితాలను పరిశీలిస్తే ఫిజికల్‌ సైన్స్‌లో అత్యధికంగా 99.59 శాతం, గణితంలో 99.46 శాతం, ఇంగ్లీషులో 98.56 శాతం, సోషల్‌ స్టడీస్‌లో 97.04 శాతం, బయలాజికల్‌ సైన్స్‌లో 96.86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 99.62 శాతంతో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, ఏలూరు జిల్లా 99.56 ఉత్తీర్ణతతో రెండో స్థానంలోనూ, గుంటూరు జిల్లా 99.12 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిలో పురుషులు 98.08 శాతం మంది, మహిళలు 98.05 శాతం మంది ఉన్నారు. ఫలితాలను విద్యామండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో ఎడ్‌సెట్‌ 2024 కోర్‌ కమిటీ సభ్యులు ఆచార్య పాల్‌ డగ్లస్‌, ఆచార్య లక్ష్మీనారాయణ పాల్గన్నారు.
ఎపి పిజి సెట్‌ ఫలితాలు
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎపి పిజిసెట్‌ – 2024 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జూన్‌ 10 నుంచి 13 వరకు మూడు రోజులపాటు 34 సబ్జెక్టులకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్ష నిర్వహించింది. ఎపిలో 24 కేంద్రాల్లోనూ, హైదరాబాద్‌ రీజియన్‌లో ఒక కేంద్రంలోనూ పరీక్ష జరిగింది. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఫలితాలను త్వరలో ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. 33 సబ్జెక్టులకుగాను 33,865 మంది దరఖాస్తు చేసుకోగా 29,908 మంది హాజరయ్యారు. వారిలో 18,467 మంది అర్హత పొందారు. ఉత్తీర్ణతా శాతం 61.75గా నమోదైంది. పురుషుల విభాగంలో 6,736 మంది (59.30 శాతం), మహిళల విభాగంలో 11,731 మంది (63.24) అర్హత సాధించారు.

➡️