కమ్యూనిస్టులు బలపడటం ద్వారానే రాష్ట్రాభివృద్ధి- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

– బిజెపిపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత
– అది టిడిపి కూటమి, వైసిపిపైనా పడుతుంది
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో కమ్యూనిస్టులు బలపడటం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన మీట్‌ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగానూ, దేశంలోనూ కమ్యూనిస్టులకు ఆదరణ పెరుగుతోందని తెలిపారు. నిజాయితీ, నైతికత, సైద్ధాంతిక బలంతో పుంజుకుంటున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల తరువాత సిపిఎం, వామపక్షాలు బలమైన శక్తిగా ముందుకొస్తాయని తెలిపారు. ఇప్పుడు పాలకులు చెబుతున్న అభివృద్ధి సరికాదని, కమ్యూనిస్టుల దృష్టిలో అభివృద్ధి అంటే జీవన ప్రమాణాలు పెరగడమేనని అన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి పాలనలో ప్రజల జీవన ప్రమాణాల కంటే సమస్యలు పెరుగుతున్నాయని, ఉపాధి లేమి ఎక్కువైందని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చట్టసభల్లో కమ్యూనిస్టుల అవసరం మరింతగా ఉందని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో ఎపి అసెంబ్లీలో కమ్యూనిస్టులు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోందని, వారిని ఎన్నుకోవడం ద్వారా ప్రజల సమస్యలపై సమగ్ర చర్చ జరుగుతుందని వివరించారు. గతంలో ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారంటే ప్రజలు ఆశతో ఎదురు చూసేవారని, ఇప్పుడు అనాసక్తి పెరిగిందని తెలిపారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రధాని విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీలు ప్లాంటుపై కనీసం మాట్లాడకుండా అరిగిపోయిన రికార్డు మాదిరి ఒకటే ప్రసంగం చెబుతున్నారని తెలిపారు. ఒకవైపు టిడిపితో కలిసి పోటీచేస్తూనే వైసిపితో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, అందువల్లే జగన్‌ గురించి కనీసం మాట్లాడటం లేదని అన్నారు. టిడిపి, బిజెపి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిజాయితీగా ఉండే కిశోర్‌చంద్రదేవ్‌ లాంటి నాయకులు ఏజెన్సీలో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపైనా, ప్రమాదకరమైన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుపైనా తొలిసారి గళమెత్తింది సిపిఎం మాత్రమేనని, వైసిపి, టిడిపి లంగిపోయాయని పేర్కొన్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును నీతి అయోగ్‌ సిఫార్సు చేస్తే కేంద్రం బిల్లు పాస్‌ చేయమని చెప్పలేదని పురందేశ్వరి చెబుతున్నారని, అలాంటప్పుడు రాష్ట్రాలకు ఎందుకు పంపించారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలు ఎల్లకాలం మోసపోరనే విషయాన్ని బిజెపి నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. ల్యాండ్‌ పూలింగు చట్టం రైతులను మోసం చేసేదిగా ఉందని, దీన్ని బలవంతంగా రాష్ట్రంలో అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బిజెపి నిరంకుశత్వం పెరిగిపోయిందని, ప్రశ్నించిన వారిని జైల్లో పెడుతున్నారని వివరించారు. ప్రతి ఎన్నికల్లో మైనార్టీ వ్యతిరేకతను పెంచి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నారని, గతంలో పుల్వామా ఘటనను వాడుకుని లబ్ధిపొందారని, అది బిజెపి కావాలని చేసిందని జమ్మూకాశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ బయటపెట్టారని తెలిపారు. అనంతరం ఇడి అధికారులు ఆయన ఇంటిపై దాడి చేశారని పేర్కొన్నారు. రాముడి పేరుతో మరొకసారి లబ్ధిపొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అంబేద్కర్‌ రాజ్యంగం వల్లే 75 సంవత్సరాలు స్వేచ్ఛగా ఉన్నామని, దీన్ని మార్చి బిజెపి అనుకూల రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 0.8 శాతం ఓట్లున్న బిజెపి టిడిపి, వైసిపి రూపంలో 25 సీట్లు పొందుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయని వివరించారు. బెంగాల్లో ఈ ఎన్నికల్లో సిపిఎం ఓటింగు పెరుగుతోందని తెలిపారు. బిజెపి వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే ఇండియా వేదిక ఆధ్వర్యంలో వివిధ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని అన్నారు.

➡️