పోస్టాఫీసుల ద్వారా అవగాహన

  •  పోస్టరును ఆవిష్కరించిన సిఇఒ ఎంకె మీనా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా 10,670 పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా సోమవారం శ్రీకారం చుట్టారు. పోస్టల్‌శాఖ ముద్రించిన పలు రకాల ఓటర్ల అవగాహన పోస్టర్లను అదనపు సిఇఒ ఎమ్‌ఎన్‌ హరీంధర్‌ ప్రసాద్‌, అసిస్టెంట్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కందుల సుధీర్‌బాబుతో కలిసి సిఇఒ ఎంకె మీనా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఇఒ మాట్లాడుతూ.. క్రమబద్ధమైన ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్యం కార్యక్రమం అమల్లో భాగంగా ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం, పోస్టల్‌ శాఖతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాష్ట్రంలోని 57 హెడ్‌ పోస్టాఫీసులు, 1,512 సబ్‌ పోస్టాఫీసులు, 9,101 బ్రాంచ్‌ పోస్టాఫీసుల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఓటు విలువను, ఎన్నికల ప్రాముఖ్యతను రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి యువత గుర్తించి రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పోస్టరు ఆవిష్కరణ కార్యక్రమంలో పోస్టల్‌ ఇన్‌స్పెక్టరు (మార్కెటింగ్‌) జి ప్రసన్న వెంకటసాయి పాల్గొన్నారు.

➡️