పూడికలు తీయకపోవటమే పంటల ముంపుకు కారణం

collector visit cyclone effected areas in tenali

డ్రైనేజ్ కాలువల సమస్యలపై ఏకరువు పెట్టిన రైతులు
వర్షాలకు దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన కలెక్టర్

ప్రజాశక్తి-తెనాలి : మిచౌంగ్ తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లా తెనాలిలో దెబ్బతిన్న పొలాలను జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. రూరల్ గ్రామం హాఫ్ పేటలో పర్యటించిన ఆయన వ్యవసాయ అధికారుల ద్వారా పంటల విస్తీర్ణం, నష్టంపై ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకున్నారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా హాఫ్ పేటలోని మురుగు కాలువలలో పూడికలు తీయకపోవటంతోనే వర్షపు నీరు పంట పొలాలలో నిలబడి పోతుందని, ఫలితంగా పంటలు ముంపుకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలలో గుర్రపు డెక్క పేరుకుపోయిందని నీటిపారుదల దాదాపుగా నిలిచిపోయిందని చెప్పారు. కొన్ని సందర్భాలలో కాలువలోనే నీరు ఎదురు తన్నే పరిస్థితులు ఉన్నాయన్నారు. పర్యటనలో ఆయన వెంట ఉన్న డ్రైనేజ్, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన కలెక్టర్ లోపాలను పరిశీలించి, సరిచేయాలని ఆదేశించారు. అయితే సాంకేతికంగా ఉన్న సమస్యలను కూడా అధికారులు ఆయనకు వివరించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు, ఎడిఎ ఎన్ ఉషారాణి, ఎంఎఓ జీ ప్రేమ్ సాగర్, ఇరిగేషన్, డ్రైనేజ్ జిల్లా అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

➡️