స్వాతంత్య్రం వచ్చినట్టుంది ! : చంద్రబాబు

  • వైసిపికి కౌంట్‌డౌన్‌ మొదలైంది
  • కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వాలే
  • టిడిపి లీగల్‌ సెల్‌ సదస్సులో చంద్రబాబు నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో స్వాతంత్రం వచ్చినట్టుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. టిడిపి లీగల్‌సెల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కోడ్‌ అమలులోకి రావడంతో వైసిపి పాలనకు కూడా కౌంట్‌డౌన్‌ ప్రారంభం అయిందని చెప్పారు. ఇక ఎవరికి భయం లేదని, అందరూ బయటకు రావచ్చని చెప్పారు. ఫించనులు కట్‌ అవుతాయని, కేసులు పెడతారన్న భయం ఇక అవసరం లేదని అన్నారు. ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలన్నది తన నినాదమని చెప్పారు. ఎన్నికల తరువాత కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్‌డిఎ ప్రభుత్వాలు రానున్నాయని చెప్పారు. కేంద్రంలో 400 సీట్లతో రాష్ట్రంలో ఎప్పుడూ లేని మెజార్జీతో గెలవబోతున్నట్లు తెలిపారు. జగన్‌కు దిమ్మతిరిగే ఫలితం ఎన్నికల్లో రాబోతోందన్నారు. 57 రోజుల తరువాత చరిత్ర తిరగరాయబోతున్నామని చెప్పారు. ఇప్పటిదాకా అన్ని ఎన్నికల్లో తన నామినేషన్‌ను కార్యకర్తలు, న్యాయవాదులే వేసేవారని, తాను కేవలం డిక్లరేషన్‌ పత్రంపైనే సంతకం చేసేవాడినని చెప్పారు. ప్రస్తుతం సాంకేతిక కారణాలతో నామినేషన్ల విషయంలో ఇబ్బందులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. తనపైన ఎన్ని దొంగ కేసులు పెట్టారో తెలియదని, అందుకు తనపై ఉన్న కేసుల వివరాలు తెలపాలని డిజిపిని కోరానని చెప్పారు. టిడిపి నుండి పోటీ చేస్తున్న మిగిలిన అభ్యర్థుల పరిస్థితి కూడా ఇదే అన్నారు. లాయర్లకు వైసిపి ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 3,500 మంది జూనియర్‌ లాయర్లకు రూ.7వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దుచేస్తామని చెప్పారు.

➡️