అధిక ఫీజులు నియంత్రించాలని ధర్నా

Jun 29,2024 20:45 #controlled, #Dharna, #High fees

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ :కార్పొరేట్‌, ప్రయివేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని, పేదలకు 25 శాతం ఉచిత సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఏలూరు డిఇఒ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్‌ మాట్లాడుతూ.. ఏలూరులో కార్పొరేట్‌, ప్రయివేట్‌ విద్యాసంస్థలు ప్రతియేటా భారీగా ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, తమ ఆదాయాల్లో అధిక భాగం కార్పొరేట్‌, ప్రయివేట్‌ విద్యాసంస్థలకు ఫీజుల రూపంలో చెల్లిస్తున్నాయని తెలిపారు. దీంతో వారు అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బుక్స్‌, మెటీరియల్‌, యూనిఫామ్‌ బ్యాగులు ఏవీ ప్రయివేట్‌ విద్యాసంస్థల్లో అమ్మకూడదన్నారు. కొన్ని ప్రయివేట్‌ విద్యాసంస్థలు దీనిని అతిక్రమిస్తున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌, ప్రయివేటు విద్య సంస్థల ఫీజుల నియంత్రణకు ఒక సమగ్ర చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని కార్పొరేట్‌, ప్రయివేట్‌ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు వి.సాయిబాబు, బి.జగన్నాథరావు, వివిఎన్‌.ప్రసాద్‌, ఎం.ఇస్సాక్‌, జి.శారద, సీనియర్‌ నాయకులు కంది విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

➡️