బిజెపి వ్యతిరేక శక్తులకు’అనంత’ ఉత్సాహం!

Feb 27,2024 10:51 #anathapuram, #ap congress, #sabha
  • రాష్ట్రంలో ఊపందుకోనున్న ‘ఇండియా వేదిక’
  • ఎన్నికల అజెండాగా ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, విభజన హామీలు

ప్రజాశక్తి-అమరావతి  : కాంగ్రెస్‌ పార్టీ అనంతపురంలో సోమవారం నిర్వహించిన బహిరంగసభ విజయవంతం కావడం రాష్ట్రంలోని బిజెపి వ్యతిరేక పార్టీలు, శక్తులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ సభకు ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు, సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ హాజరయ్యారు. తమిళనాడు నుండి ఇండియా వేదికలో కీలక భాగస్వామిగా ఉన్న విసికె పార్టీ నాయకులు కూడా ఈ సభలో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన బిజెపి వ్యతిరేక పార్టీలు, లౌకిక శక్తులను కలుపుకుపోవడానికి గట్టి కృషి జరుగుతున్నట్లు సమాచారం. దీంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఇండియా వేదిక కార్యక్రమాలు ఊపందుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి, దానితో జతకట్టిన జనసేన.. బిజెపికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటానికి సిద్ధపడని విషయం తెలిసిందే. వీటిలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో జనసేన భాగస్వామిగా ఉంది. మైనార్టీలపై దాడులను ప్రతిఘటించే విషయంలోనూ ఆ మూడు పార్టీలు మూగనోము పట్టాయి. రాష్ట్రంలో ఒక్క ఎంపి స్థానం కూడా లేకపోయినప్పటికీ అన్ని బిల్లులకూ బిజెపికి మద్దతు లభిస్తోంది. ఈ వాతావరణాన్ని మార్చడానికి సిపిఎం, సిపిఐతోపాటు ఇతర వామపక్ష పార్టీలు, అభ్యుదయ, లౌకిక శక్తులు పోరాడుతూ వచ్చాయి. వారందరి నిరంతర కృషి ఫలితంగానే ప్రత్యేక హోదా, విభజన హామీల అంశం ప్రజానీకంలో చర్చనీయాంశంగా ఉంది. ఏళ్ల తరబడి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం కార్మికుల నేతృత్వంలో కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు తమ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. వైసిపి, టిడిపి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ బిజెపికి వంతపాడుతుండటంతో ఈ అంశాలను పూర్తిగా విస్మరిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ఈ అంశాలను విస్మరించడమేగాక ఎన్నికల ప్రచారాన్ని కూడా వ్యక్తుల చుట్టూ తిప్పి వ్యక్తిగత విమర్శలతో ఆ పార్టీలు ఇప్పటికే సరిపుచ్చుతున్న సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రంలో ఇండియా వేదిక కార్యక్రమాలు ఊపందుకునే కొద్దీ ఈ పరిస్థితి మారనుంది. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు, పోలవరం వంటి అంశాలు బలంగా ముందుకొచ్చే అవకాశం ఉంది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో దీనితో పాటు మిగిలిన అంశాలను కూడా ఇండియా వేదిక పార్టీలు ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంది. అదే జరిగితే, ఇప్పటి వరకు వీటిని విస్మరించి ఇతర అంశాల చుట్టూ తిరుగుతున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు కూడా పెదవి విప్పక తప్పని స్థితి ఏర్పడుతుంది. సోమవారం అనంతపురంలో జరిగిన సమావేశంలోనే ఈ అంశాలను కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ నాయకులు ప్రస్తావించారు. రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

➡️