ప్రజలకు అభివాదం చేస్తూ.. విశాఖలో మౌనంగా సాగిన జగన్‌ బస్సు యాత్ర

Apr 22,2024 01:00 #bus tour, #cm jagan, #vizag
  • సిఎం మాట్లాడకపోవడంతో పలువురు నిరాశ

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో/ ఎంవిపి కాలనీ : విశాఖ నగరంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రజలకు అభివాదం చేస్తూ మౌనంగానే ముందుకు సాగింది. జనం పెద్ద సంఖ్యలో హాజరైనప్పటికీ ఎక్కడా ఆయన ప్రసంగించలేదు. హనుమంతువాక, ఎండాడ వంటి చోట్ల జగన్‌ మాట్లాడతారని జనం ఆశించారు. తొలుత ఆయన పెందుర్తి మండలం మీదుగా గోపాలపట్నంకు చేరుకున్నారు.
ఎన్‌ఎడి, దుర్గాలమ్మ గుడి, మర్రిపాలెం, ఐటిఐ జంక్షన్‌, ఊర్వశి మీదుగా కంచరపాలెం, సత్యం జంక్షన్‌, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతవాక మీదుగా బస్సు యాత్ర సాగింది. ఎండాడలో ఎక్కడికక్కడ జనం సిఎం జగన్‌కు పూలు, హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, తప్పెటగుళ్లు, ఒంటెలు, కోలాటాలు, పులి వేషాలు రోడ్‌షోలో ప్రధాన ఆకర్షణగా కనిపించాయి. రాత్రి 8 గంటలకు బిఆర్‌టిఎస్‌ రోడ్డు హనుమంతవాక జంక్షన్‌ జనసందోహంతో కిక్కిరిసిపోయింది. ఎండాడ జంక్షన్‌లో ఒక మహిళ జగన్‌ను పిలుస్తూ తన వద్దగల దరఖాస్తును ఇవ్వాలని చూడగా గమనించిన జగన్‌ ఆమె వద్దగల కాగితాలను తీసుకోవాలని సెక్యూరిటీని ఆదేశించగా వారు తీసుకున్నారు. విశాఖలోని పెందుర్తి, పశ్చిమం, దక్షిణం, తూర్పు, ఉత్తరం, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ బస్సు యాత్ర సాగింది. బస్సు యాత్రలో విశాఖపట్నం వైసిపి పార్లమెంట్‌ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు వైవి.సుబ్బారెడ్డి, విశాఖపట్నం ఎంపీ ఎంవివి.సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.

పలువురు వైసిపిలో చేరిక
2019 ఎన్నికల్లో విశాఖ దక్షిణం నుంచి పోటీచేసిన జనసేన నాయకులు గంపల గిరిధర్‌, మూగి శ్రీనివాస్‌, భీమిలికి చెందిన విద్యావేత్త ఆలివర్‌రారు, శంకర్‌ ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీ కృష్ణకుమార్‌, ఉడా మాజీ డైరెక్టర్‌ డి.భారతి, టిడిపి యువజన విభాగం నాయకులు చరణ్‌, సందీప్‌, కిరణ్మయి, దాసు వైసిపిలో జగన్‌ సమక్షంలో చేరారు.

నోరు విప్పని జగన్‌
జగన్‌ రోడ్‌ షోకు జనం హోరెత్తినా ఆయన నోరు విప్పలేదు. దీంతో పలువురు నిరాశచెందారు. గంటల తరబడి జనం వేచిచూడగా.. ఒక్క నిమిషం పాటు అలా అభివాదం చేస్తూ జగన్‌ వెళ్లిపోవడంతో పలు చోట్ల జనం అసంతృప్తికి లోనయ్యారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు మూడేళ్లుగా పోరాడుతున్నా వారి వైపు జగన్‌ కన్నెత్తి చూడలేదు. జీతాల సమస్యపై అదానీ గంగవరం పోర్టు కార్మికులు సమ్మెలోకి దిగడంతో కార్గో హేండ్లింగ్‌ మొత్తం పోర్టులో నిలిచిపోయింది. ఏళ్ల తరబడి పంచగ్రామాల భూ సమస్య కొనసాగింది. ఈ అంశాలపై మాట్లాడతారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది.

➡️