సిఎఎపై నోరుమెదపరేం?

  •  టిడిపి, జనసేన, వైసిపిలకు వి శ్రీనివాసరావు సూటి ప్రశ్న

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ‘బిజెపి 2019లో చేసిన సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ)పై దేశమంతా ఆనాడే భగ్గుమంది. కేవలం ముస్లింలే కాకుండా ప్రజానీకంలో అత్యధిక భాగం దాన్ని తిరస్కరించగా మళ్లీ నాలుగేళ్ల తర్వాత 2024 ఎన్నికల ముందు చట్టానికి రూల్స్‌ ఫ్రేం చేశాం. నోటిఫై చేశామని చెపుతోంది. హిందూ, ముస్లిముల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ చట్టాన్ని దేశంపై బిజెపి రుద్దుతోంది. తద్వారా ఓట్లు రాల్చుకునే పన్నాగం పన్నింది’ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రంలోని టిడిపి, జనసేన, వైసిపి ఎందుకు నోరుమెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో బి.పద్మ అధ్యక్షతన సిపిఎం విశాఖ జిల్లా విస్తృత స్థాయి సమావేశం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన వి.శ్రీనివాసరావు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడుతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు (గత ఎన్నికల్లోనే 0.8 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి) తిరస్కరించిన బిజెపితో టిడిపి, జనసేన పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి మరింత ద్రోహం చేశాయని, ఆ పార్టీల దిగువ స్థాయి నాయకులు, కార్యకర్తలు బిజెపితో పొత్తుపై కుతకుతలాడిపోతున్నారని తెలిపారు. ‘నా మైనారిటీలు, నా ఎస్‌సిలు, నా ఎస్‌టిలు’ అంటూ దీర్ఘాలు తీసే ముఖ్యమంత్రి జగన్‌ సిఎఎపై ఎందుకు నోరు విప్పడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఢిల్లీ పాలకులకు వీరంతా కలసి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు మాటలు హాస్యాస్పదం…
బిజెపితో పొత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసమంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని వి.శ్రీనివాసరావు అన్నారు. గడిచిన పదేళ్లలో రాష్ట్రానికి మోడీ చేసిన మేలేమిటో ఆయన చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టి కేసుల నుంచి బయటపడడానికి బిజెపితో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. వైజాగ్‌ స్టీల్‌ను అమ్మకానికి పెట్టిన, రైల్వే జోన్‌కు, పోలవరానికి, విజయనగరం జిల్లాలోని గిరిజన యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా ఎండగట్టిన బిజెపితో టిడిపి, జనసేన కూటమి కట్టి ఓట్లడిగే హక్కు కోల్పోయారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఎవరు గెలిచినా మోడీ చెప్పు చేతల్లోకే జగన్‌, చంద్రబాబు, పవన్‌ వెళ్తారని, ఇది రాష్ట్రానికి తీవ్ర వినాశకరమని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌… నవరత్నాల కోసం రూ.2.60 లక్షల కోట్లు ఇచ్చామంటూ అరిగిపోయిన రికార్డు మాదిరిగా పదేపదే చెబుతున్నారని, ఇచ్చిన దానికంటే నాలుగు రెట్లు విద్యుత్‌ ఛార్జీలు, ఇసుక, జిఎస్‌టి, చెత్త, ఆస్తి పన్నుల రూపంలో ప్రజలపై భారాలు మోపి రూ.లక్షల కోట్లు లాగడం నిజం కాదా? అని ప్రశ్నించారు.
ఇండియా వేదికకే ఆ సత్తా ఉంది…
దేశంలో పలు రాష్ట్రాల్లో మోడీ గ్రాఫ్‌ పడిపోతోందని వి.శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రానికి అన్ని విధాలా నష్టం చేసే బిజెపిని వచ్చే ఎన్నికల్లో ఓడించే సత్తా ఏకైక ప్రత్యామ్నాయం సిపిఎం, సిపిఐ, వామపక్ష, లౌకిక శక్తులతో ఏర్పాటైన ‘ఇండియా వేదిక’కే ఉందని అన్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన ప్రాంతీయ సభలో 12 పార్టీలు పాలుపంచుకున్నాయని తెలిపారు. 2024లో దేశంలో మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, లౌకిక విలువలను దహించి వేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ శక్తులను రాష్ట్రంలో ప్రజలు ఆదరించాలని, సిపిఎం, సిపిఐ, ఇతర లౌకిక పార్టీల ఇండియా వేదికకు విజయాన్ని అందించాలని కోరారు.
అరకు పార్లమెంట్‌, అరకు, గాజువాక అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం పోటీ : లోకనాథం
ఉమ్మడి విశాఖ జిల్లాలో అరకు పార్లమెంట్‌, అరకు, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి సిపిఎం పోటీ చేయనున్నట్లు కె.లోకనాథం తెలిపారు. బిజెపి ప్రభుత్వం నుంచి విశాఖ ఉక్కును రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అటవీ ప్రాంత రక్షణకు, గిరిజన హక్కుల పరిరక్షణకు అనేక రూపాల్లో తమ పార్టీ నికరంగా ఉద్యమిస్తోందని తెలిపారు. బిజెపిని, ఆ పార్టీకి సహకరిస్తోన్న రాజకీయ పార్టీలను ఈ ప్రాంతాల నుంచి తరిమికొట్టాలని, సిపిఎం అభ్యర్థులను చట్టసభలకు పంపాలని ప్రజలను కోరారు.

➡️