తహశీల్దారు హత్యతో రెవెన్యూ ఉద్యోగుల్లో భయాందోళనలు

Feb 5,2024 11:43 #Tahsildar, #vizag

ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తహశీల్దారు రమణయ్య హత్యతో రెవెన్యూ ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు కనిపిస్తున్నాయని, విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడి చేయాలనే ఆలోచనే రాకుండా చట్టాలను కఠినతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. విజయవాడలోని గవర్నర్‌పేట రెవెన్యూ భవన్‌లో అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్‌ పలు తీర్మానాలను ఆమోదించింది. తహశీల్దారు రమణయ్య హత్యను తీవ్రంగా ఖండించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపింది. హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని, రమణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. భూ వివాదాలు ఉన్న మండలాల తహశీల్దార్లకు ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించేలా చట్టం తీసుకురావాలని తీర్మానించారు. ఎన్నికల ప్రకియ సందర్భంగా ఉద్యోగులు/అధికారులపై వచ్చే ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉద్దేశ పూర్వకంగా తప్పు జరిగినట్లు రుజువు కాబడిన సందర్భంలో మాత్రమే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సమావేశం పేర్కొంది. చిన్నచిన్న విధానపరమైన లోపాలపై తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో ఉద్యోగులు అభద్రతా భావం కలిగి, మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని రాష్ట్ర కార్యవర్గం భావించింది.

➡️