శిరోముండనం తీర్పు అమలు నిలిపివేత

May 8,2024 07:19 #AP High Court, #judgement
  • జూన్‌ 20 వరకూ పొడిగింపు : హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి, అమరావతి బ్యూరో : దళిత యువకుల శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఇతర ముద్దాయిలకు కింది కోర్టు విధించిన జైలు శిక్ష అమలును హైకోర్టు నిలిపివేసింది. ఏడాదిన్నర జైలుశిక్ష విధిస్తూ విశాఖపట్నం ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు జూన్‌ 20 వరకు పొడిగించింది. ఈలోగా బాధితులు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు బుధవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. తీర్పును సవాల్‌ చేస్తూ త్రిమూర్తులు, ఇతరులు వేర్వేరుగా హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. త్రిమూర్తులు తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ కలిగినీడి చిదంబరం వాదిస్తూ, కింది కోర్టు తీర్పు అమలు నిలుపుదల ఉత్తర్వులు ఈ నెల 15 వరకే అమల్లో ఉంటాయని, ఆ ఉత్తర్వుల కాలాన్ని పొడిగించాలని కోరారు. తీర్పును అమలు చేయాలని, నిలిపివేత ఉత్తర్వులు జారీ చేయొద్దని బాధిత యువకుల తరఫున న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనల నిమిత్తం విచారణను జూన్‌ 20కు వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకు తీర్పు అమలు నిలిపివేత కొనసాగుతుందని న్యాయమూర్తి తెలిపారు.

నిలిపేయడం విచారకరం : సిపిఎం
వెంకటాయపాలెం శిరోముండనం కేసు తీర్పు అమలు నిలిపేయడం విచారకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. 26 సంవత్సరాల తరువాత ఇచ్చిన ఈ పాటి తీర్పును కూడా నిలిపేయడం దళితులకు రక్షణ లేకుండా పోయే పరిస్థితిని కల్పిస్తుందని పేర్కొన్నారు. పెత్తందార్లు మరింత పెట్రేగిపోతారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని తీర్పు అమలయ్యేలా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు.

కోర్టు తీర్పు బాధాకరం : కెవిపిఎస్‌
శిరోముండనం కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడం బాధాకరమని కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ మేరకు అధ్యక్ష కార్యద్శులు ఒ.నల్లప్ప, ఆండ్ర మాల్యాద్రి బుధవారం ప్రకటన విడుదల చేశారు.

➡️