ప్రమాదకర స్థితిలో దేశం

  • మోడీని గద్దె దింపి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
  •  తిరుపతి ఎన్నికల సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ప్రజాశక్తి -తిరుపతి సిటీ : ప్రస్తుతం దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న నరేంద్ర మోడీని గద్దె దింపాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తిరుపతిలో శనివారం జరిగిన ఆ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి పి.మురళీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తొలుత బాలాజీ కాలనీలోని జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం ప్రచార ర్యాలీని ప్రారంభించారు. రాజీవ్‌ గాంధీ విగ్రహం సర్కిల్లో జరిగిన సభను ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎన్నికల్లో కోటీశ్వరులకు.. పేదలకు మధ్య పోటీ ఉందన్నారు. రూ.వందల కోట్లు ఆస్తులు కలిగిన అభ్యర్థులు బరిలో ఉన్నారని, వారితో సాధారణ కార్మికులు, మధ్య తరగతికి చెందిన అభ్యర్థులు పోటీ పడుతున్నారని గుర్తు చేశారు. డబ్బులతో ఓట్లు కొనాలని రకరకాల వ్యూహాలు చేస్తున్నారని, దీనికి ప్రజలు అడ్డుకట్ట వేయాలని కోరారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ పేదలకు, మహిళలకు, రైతులకు, కార్మికులకు చేసింది ఏమీ లేదన్నారు. కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ, వాళ్ల వృద్ధి కోసం పని చేశారని విమర్శించారు. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం చాలా ప్రమాదకరమన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, కాంగ్రెస్‌ నాయకులు మాంగాటి గోపాల్‌ రెడ్డి, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

➡️