ఉచితంగా ఇసుక, టిడ్కో ఇళ్లు

  • ఉద్యోగస్తులకు ఒకటో తేదీన జీతాలు
  • చింతలపూడి ఎత్తిపోతల కల నెరువేరుస్తాం
  • దర్శి, నూజివీడు, కాకినాడలో చంద్రబాబు నాయుడు

ప్రజాశక్తి – యంత్రాంగం : ట్రాక్టర్‌ ఇసుకను రూ.1000 నుంచి రూ.5000 సిఎం జగన్‌ పెంచారని, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక మాఫియాను తుంగలో తొక్కేస్తామని, ఉచిత ఇసుకను అందిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగస్తులకు పిఆర్‌సి, ఇంటీరియమ్‌ రిలీఫ్‌, మొదటి తేదీన జీతాలు, రిటైర్‌ ఉద్యోగస్తులకు మొదటి తేదీన పెన్షన్‌ ఇచ్చే బాధ్యత తమదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రావాల్సిన బకాయిలు ఇస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు ఉచితంగా అందిస్తామని, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు కార్పొరేషన్‌ రుణాలు అందిస్తామని అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి గడియార స్తంభం సెంటర్‌, ఏలూరు జిల్లా నూజివీడు, కాకినాడలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రసంగించారు. నాడు క్వార్టర్‌ మద్యం రూ.60 ఉంటే నేడు రూ.200కు పెరిగిందని, రూ.140 ఎవరి జేబులోకి వెళుతున్నాయని ప్రశ్నించారు. పట్టాదారు పాసు పుస్తకం చూస్తే జగనన్న భూ హక్కు చట్టం ఉందని, భూమి ప్రజలది బొమ్మ జగన్‌దా? అని ప్రశ్నించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను తెచ్చారు. మీ భూమి మీది కాదు. మీ భూమి జగన్‌ గుప్పెట్లో ఉంది’ అని వివరించారు. తన తండ్రి మరణానికి కారణం రిలయన్స్‌ అని అన్నారని, అధికారంలోకి వచ్చాక ఆ సంస్థ వ్యక్తికే ఎంపి పదవి ఇచ్చారని విమర్శించారు. మనం కట్టే పన్నులతోనే వలంటీర్లకు రూ.ఐదు వేలు జీతాలు ఇస్తున్నారని, ఎన్నికల డ్యూటీలో వారిని పెట్టవద్దని చెబితే పేదవాళ్లపై కక్షకట్టి ఏప్రిల్‌ నెలలో 33 మంది చనిపోవడానికి కారణమయ్యారని ఆరోపించారు. ఇప్పుడు నేరుగా ఇంటి వద్ద ఇవ్వకుండా బ్యాంకులో వేస్తున్నారని, బ్యాంకుల చుట్టూ తిరగలేక ఇప్పటికే ఏడుగురు చనిపోయారని చెప్పారు. అందరికీ సెంటు భూమి ఇచ్చి సిఎం మాత్రం వందల గదుల ప్యాలెస్‌లో ఉంటున్నారని విమర్శించారు. అమరావతి పూర్తయితే నూజివీడుకు అవుటర్‌ రింగ్‌రోడ్డు వచ్చేదని, అమరావతికి పూర్వవైభవం తెస్తామన్నారు. జగన్‌ది క్లాస్‌వార్‌ కాదని క్యాష్‌ వారని ఎద్దేవా చేశారు. తాను ఇచ్చేవాడినే కానీ తీసేవాడిని కాదని, జగన్‌ కంటే 20 శాతం అదనంగా ఇస్తామని చెప్పారు. నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌, ఇసుక, మట్టి దోపిడీ సాగిందని ఆరోపించారు. నూజివీడు నియోజకవర్గంలో తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ, సమస్యలను తీరుస్తామని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, చింతలపూడిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నూజివీడు నియోజకవర్గంలో తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ, సమస్యలను తీరుస్తామని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు.

➡️