రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

  • మతతత్వ బిజెపిని వ్యతిరేకించిన వైఎస్‌ఆర్‌
  •  ఎపి న్యాయ్ యాత్రలో వైఎస్‌ షర్మిల
  •  రాష్ట్రాన్ని బిజెపి చేతిలో పెడితే సర్వనాశనం : వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి, జీలుగుమిల్లి,కొయ్యలగూడెం : టిడిపి, వైసిపి ప్రభుత్వాల పదేళ్ల పాలనలో రాష్ట్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని, అభివృద్ధి శూన్యమని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల విమర్శించారు. మతతత్వ బిజెపిని వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వ్యతిరేకించారని, గోద్రా ఘటనలో ఉతికి ఆరేశారని వివరించారు. మణిపూర్‌లో ఘోరం జరిగినా సిఎం జగన్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అటువంటి బిజెపితో అక్రమ పొత్తు పొట్టుకున్న జగన్‌ మోహన్‌రెడ్డి రాజశేఖర్‌రెడ్డి వారుసుడా..? అంటూ ప్రశ్నించారు. ఎపి న్యారు యాత్రలో భాగంగా సోమవారం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెంలో నిర్వహించిన సభల్లో షర్మిల మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు, జగన్‌హన్‌రెడ్డి బిజెపికి తాకట్టు పెట్టారన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులను నట్టేట ముంచారని మండిపడ్డారు. గత పదేళ్లుగా పోలవరం ప్రాజెక్టును ఓ ఎటిఎంగా మార్చుకున్నారని, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను బిజెపికి తాకట్టు పెట్టారని విమర్శించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అభివృద్ధి చేసిందేమీ లేదని, ఇసుక మాఫియా, మట్టి మాఫియాలను పెంచి పోషించారని ఆరోపించారు. నియోజకవర్గంలో వ్యతిరేకత రావడంతో భార్యకు సీటు తెచ్చుకున్నారని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్రబాబు కూటమికి ఓటేసినా, వైసిపికి ఓటేసినా ఢిల్లీ నుంచి మోడీ, అమిత్‌ షా రాష్ట్రాన్ని పాలిస్తారని తెలిపారు. రాష్ట్రంలో బిజెపికి కనీస ఓటు బ్యాంకు లేకపోయినప్పటికీ పోటీపడి ఆ మూడు పార్టీలు మద్దతు తెలపడంలో ప్రజాప్రయోజనం లేదని వివరించారు. రాష్ట్రాన్ని బిజెపి చేతిలో పెడితే సర్వనాశనం చేస్తారని హెచ్చరించారు. మతసామరస్యం, దేశసమైక్యత వంటి ఎన్‌టిఆర్‌ ఆశయాలకు తూట్లు పొడిచి మతతత్వ బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురందేశ్వరిని ఓడించాలని కోరారు. వైసిపి ప్రకటించిన మేనిఫెస్టో తుస్సుమనిపించారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే మేనిఫెస్టో కావాలన్నారు. కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి గిడుగు రుద్రరాజు, రంపచోడవరం సిపిఎం అసెంబ్లీ అభ్యర్థి లోతా రామారావు, కాంగ్రెస్‌ రాజమండ్రి సిటీ అభ్యర్థి బోడా వెంకట్‌, రూరల్‌ అభ్యర్థి బాలేపల్ల మురళి, సిపిఎం తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, కాకినాడ జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి టి. మధు తదితరులు పాల్గొన్నారు.

➡️