ప్రజల పక్షాన పోరాడే వారిని గెలిపించండి

Apr 30,2024 08:59 #2024 election, #cpm
  •  సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం

ప్రజాశక్తి-యంత్రాంగం : సిపిఎం అభ్యర్థులు సోమవారం విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడి వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామని, తమకు ఓటువేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. రానున్న ఎన్నికల్లో తమను గెలిపించినట్లయితే ఆయా నియోజవర్గాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న బిజెపికి మరోసారి అవకాశమిస్తే దేశం అంథకారమవుతుందని హెచ్చరించారు. బిజెపిని, దాని తోక పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో పాణ్యం అభ్యర్థి డి.గౌస్‌ దేశాయ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బస్టాండ్‌ సెంటర్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలపైన భారాలు మోపుతూ సంపన్నులకు దోచిపెడుతోందని విమర్శించారు. మైనార్టీలను అడుగడుగునా అణచివేస్తోందని తెలిపారు. అలాంటి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరముందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్నాయని, వాటిని ఓడించాలని పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులు, కర్షకులు, మహిళల పక్షాన పోరాటం చేస్తున్న తమను గెలిపించాలని కోరారు.


పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో ఆ నియోజకవర్గం అభ్యర్థి మండంగి రమణ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బారావమ్మ పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తుంటే రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు దానికి మద్దతివ్వడం దారుణమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న బిజెపిని ఈ ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. గిరిజన సమస్యలపై పోరాడుతున్న కురుపాం అభ్యర్థి మండంగి రమణ, అరకు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సను గెలిపించాలని కోరారు. అనంతరం నీలకంఠాపురంలో సంత వద్ద రోడ్డు పక్కనున్న చిరు వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం, వంగర, నోండ్రుకోన పంచాయతీల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.


నెల్లూరులోని రైల్వే ఫీడర్స్‌ రోడ్డు, రంగనాయకులపేట, రామయ్యబడి సెంటర్‌, మూలాపేట అలంకార్‌ సెంటర్‌, శివాలయం సెంటర్‌ తదితర ప్రాంతాల్లో సిపిఎం నెల్లూరు నగర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మూలం రమేష్‌, కాంగ్రెస్‌ నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల రాజు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు దాటినా దళితుల్లో పేదరికం ఇంకా తాండవిస్తోందని తెలిపారు. మోడీ నిరంకుశ విధానాలను రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు చెందాల్సిన సబ్‌ప్లాన్‌ నిధులను వైసిపి ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు.


ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ 24వ డివిజన్‌లోని కస్తూరిబాయిపేట, గిరిపురం, సీతారాంపురంలో సెంట్రల్‌ నియోజకవర్గం అభ్యర్థి చిగురుపాటి బాబూరావు ప్రచారం నిర్వహిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి బిజెపి పబ్బం గడుపుకోవటానికి ప్రయత్నిస్తోందని, దీనికి టిడిపి, వైసిపి వంతపాడుతున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా నగరంలోని వ్యాపారాలు దెబ్బతిన్నాయన్నారు. మోడీ తెచ్చిన పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, చిల్లర వర్తకంలోకి బడా కంపెనీల ప్రవేశం వలన చిన్న, మధ్య తరగతి వ్యాపారాలు, పరిశ్రమలు దెబ్బతిన్నాయన్నారు. ఉపాధి కోల్పోయారని తెలిపారు.


కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని వేమండ, ముక్కపాడు, లంకపల్లి, మదిరపాడు, కొయ్యగూరపాడు, ఆముదాలపల్లి, పొణుకుమాడు, కొత్తూరు, ఉంగుటూరు, ఎలుకపాడు గ్రామాల్లో సిపిఎం గన్నవరం నియోజకవర్గం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ మచిలీపట్నం ఎంపి అభ్యర్థి గొల్లు కృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించిందన్నారు. రాష్ట్రంలో 23 ఎంపి స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి మోసం చేసిందని వివరించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సాధించలేదని తెలిపారు. పైగా బిజెపి నష్టదాయక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు.


గుంటూరు జిల్లా ఎంటిఎంసి పరిధిలోని మేల్లంపూడిలో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్న శివశంకరరావు రోడ్‌ షో నిర్వహించారు. తొలుత దళితవాడలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జొన్న శివశంకరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా మోసం చేసిన మోడీని.. టిడిపి, జనసేన, వైసిపి పార్టీలు బలపరచడం సిగ్గుచేటని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బిజెపిని, దాని తోకపార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
విశాఖలోని జోగవానిపాలెం, భానోజీ తోట, ఉప్పర కాలనీ, రాజీవ్‌ నగర్‌ కాలనీ, బొజ్జనకొండ, దశమకొండలో గాజువాక అభ్యర్థి ఎం జగ్గునాయుడు విస్తతంగా ప్రచారం నిర్వహించారు. మతోన్మాద బిజెపిని గద్దె దించాలని పిలుపునిచ్చారు.


అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం చినలబుడు, తురయిగుడ, హట్టగుడ, డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీ సిమిలిగుడ, వసబంధ, హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ ఒంటిపాకలో అరకు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గంగాధరస్వామి ప్రచారం చేశారు. రంపచోడవరం, వై.రామవరం, విఆర్‌.పురం మండలాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు ప్రచారం చేపట్టారు. ఇండియా వేదిక నాయకత్వంలో ప్రజా పరిపాలన వచ్చేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

➡️