వైభవంగా రథోత్సవం

Apr 28,2024 21:56

ప్రజాశక్తి-మాచర్ల : శ్రీ లక్షీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం చెన్నకేశవస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. 60 అడుగల ఎత్తుతో రాష్ట్రంలోనే రెండవ పెద్దదైన రథంగా పేరొందిన మాచర్ల రథోత్సవం చూడటానికి పలు జిల్లాల నుంచి పెద్దఎత్తున సందర్శకులు తరలివచ్చారు. కుమ్మరులు కుంభం పోయగా సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభమైనది. గొలుసుపట్టే ప్రధాన బాధ్యత వడియరాజులులు చేపట్టగా, ముదిరాజులు రథం చఫ్పాలు వేస్తూ రథం గమనం తప్పకుండా నడిచేలా బాధ్యతలు నిర్వహించారు. డీఎస్పీ సారథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకల్లో వైసిపి, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జూలంకటి బ్రహ్మానందరెడ్డి హాజరవడంతోపాటు పలు సేవా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా పట్టణానికి చెందిన పలు స్వచ్ఛంద సేవా సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. రథోత్సవానికి హాజరైన సందర్శకులకు మజ్జిక, పులిహోర, దద్దొజనం పంపిణీ, అన్నదానం చేపట్టారు. బ్రహ్మనాయుడు కూలగాయల మార్కెట్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. నవోదయ సైకిల్‌ షోరూం కటకం శేషగిరి, పరాశక్తి సిమెంట్‌ ఏజెన్సీ, భవన నిర్మాణ కార్మిక సంఘం, పండ్ల మార్కెట్‌ అచ్చాపద్మావతి, బ్రహ్మనాయుడు కూలగాయల మార్కెట్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన పులిహోర పంపిణీ చేశారు.

➡️