328 స్థానాల్లోనే కాంగ్రెస్‌ పోటీ

May 8,2024 23:42 #Congress

లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ ఈ తడవ అతితక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది. కేంద్రంలో బిజెపిని ఓడించేందుకు ‘ఇండియా’ బ్లాక్‌గా ఏర్పడి, పలు రాష్ట్రాల్లో వివిధ భావ సారూప్య పార్టీలతో అవగాహన కుదుర్చుకోవడం వలన కాంగ్రెస్‌ పోటీ చేసే స్థానాల సంఖ్య ఎన్నడూలేని స్థాయిలో పడిపోయింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 328 లోక్‌సభ స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ‘ఇండియా’ పార్టీలకు 101 స్థానాల కేటాయింపుతో కాంగ్రెస్‌ సీట్లు తగ్గాయి. 2004 లోక్‌సభ ఎన్నికల్లో అతి తక్కువగా 417 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీచేయగా, 2009లో 440 సీట్లలో, 2019లో 421 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్‌కు బలమున్న కొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు సీట్లను వదిలేసింది. కర్ణాటక, ఒడిశాల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుండగా ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ల్లో హస్తం పోటీ బాగా తగ్గిపోయింది. 2019లో కర్ణాటకలో 21 స్థానాల్లో పోటీ చేయగా ఈసారి మొత్తం 28 సీట్లలో బరిలోకి దిగింది. ఒడిశాలోనూ గత ఎన్నికల్లో 18 స్థానాల్లో పోటీ చేయగా ఈసారి 20 స్థానాల్లో పోటీచేస్తోంది. మిజోరాంలో ఒకే ఒక్క స్థానంలో పోటీ చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 2019లో 67 స్థానాల్లో పోటీచేయగా ఈసారి సమాజ్‌వాదీ పార్టీతో పొత్తులో భాగంగా 17 స్థానాల్లో పోటీ పడుతోంది. పశ్చిమబెంగాల్‌లో 42 స్థానాలకు గాను గత ఎన్నికల్లో 40 చోట్ల పోటీ చేయగా ప్రస్తుతం ఇండియా కూటమిలోని లెఫ్ట్‌ పార్టీలకు సీట్లు కేటాయించడంతో 14 స్థానాల్లో పోటీ పడుతోంది. మహారాష్ట్రలో ఇండియా బ్లాక్‌ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జఠిలమయ్యింది. 2019లో ఎన్‌సిపితో భాగస్వామ్యం ఉండగా ఈసారి ఉద్ధవ్‌ శివసేన కూడా కలవడంతో ముగ్గురిలో సీట్ల సర్దుబాటు చేయడంతో 25 స్థానాలనుంచి 17 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలో ఆప్‌ పార్టీకి గట్టి పట్టు ఉండటంతో పొత్తులో భాగంగా మూడు స్థానాల్లోనే పోటీ పడుతోంది. హర్యానా, మిజోరాంలో ఒక స్థానంలోనూ, గుజరాత్‌లో 25 స్థానాల్లో పోటీ చేస్తోంది. రాజస్థాన్‌లో మూడు స్థానాలు… సిపిఎం, ఆర్‌ఎల్‌పి, బిఎపిలకు ఒక్కో సీటును కేటాయించింది. త్రిపురలో సిపిఎంకు ఒక స్థానం అవగాహనలో ఇవ్వగా, జమ్మూకాశ్మీర్‌లో ఐదు స్థానాలకుగాను మూడు చోట్ల పోటీ చేస్తోంది. సూరత్‌, ఇండోర్‌ స్థానాల్లో అభ్యర్థుల విరమణతో 330 సీట్ల నుంచి 328 స్థానాల్లోనే బరిలో ఉంది.

➡️