హర్యానాలో తాజాగా ఎన్నికలు జరపండి – కాంగ్రెస్‌ డిమాండ్‌

May 8,2024 23:52 #Congress, #Haryana

– హస్తం పార్టీకి జెజెపి మద్దతు
చండీఘడ్‌ : హర్యానాలోని బిజెపి ప్రభుత్వానికి ముగ్గురు ఇండిపెండెంట్‌ ఎంఎల్‌ఎలు మద్దతును ఉపసంహరించుకోవడంతో మైనారిటీలో పడిన నయాబ్‌ సింగ్‌ సైని ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని, ఆ తర్వాత తాజాగా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ కోరింది. ఈ విషయంపై హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు లేఖ రాయనున్నట్లు తెలిపింది. జెజెపి, ఐఎన్‌ఎల్‌డి, అలాగే ఇండిపెండెంట్‌ ఎంఎల్‌ఎ బాలరాజ్‌ కుందూ కూడా గవర్నర్‌కు లేఖలు రాయాలని కోరింది.
ఇదిలావుండగా, హర్యానా ముఖ్యమంత్రి సైని సిర్సాలో బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ, తమ ప్రభుత్వమేమీ సమస్యల్లో లేదని చెప్పారు. బలంగా పనిచేస్తోందన్నారు. ముగ్గురు ఇండిపెండెంట్‌ ఎంఎల్‌ఎలు ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుని, కాంగ్రెస్‌ పార్టీకి మ్దతునిస్తున్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం మైనారిటీలో పడింది. వారు అధికారంలో కొనసాగే అధికారం ఇంక లేదు. అందువల్ల ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలనను విధించాలి, తాజా ఎన్నికలు నిర్వహించాలని హర్యానా కాంగ్రెస్‌చీఫ్‌ ఉదరు భాను పేర్కొన్నారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఇప్పటికే ముగ్గురు ఇండిపెండెంట్‌ ఎంఎల్‌ఎలు గవర్నర్‌కు లేఖ రాశారని తెలిపారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత బి.బి.బాత్రా మాట్లాడుతూ, ఒకప్పుడు బిజెపికి మిత్రపక్షమైన జననాయక్‌ జనతా పార్టీ (జెజెపి) కూడా గవర్నర్‌కు లేఖ రాసి, తాము ప్రభుత్వానికి మద్దతునివ్వడం లేదని స్పష్టం చేయాలన్నారు.
అసెంబ్లీలో ప్రస్తుత కూర్పును పరిశీలించి, సైని ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కాంగ్రెస్‌ గనక చర్యలు తీసుకుంటే తాము మద్దతునిచ్చే విషయాన్ని పున:పరిశీలిస్తామని జెజెపి నేత దిగ్విజరు సింగ్‌ చౌతాలా తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్‌ అని స్పష్టం చేశారు. చౌతాలా ప్రకటనపై బాత్రా స్పందిస్తూ, బిజెపి ప్రభుత్వానికి మద్దతునివ్వడం లేదని ముందుగా జెపిపి గవర్నర్‌కు లేఖ రాయాలి, మాకు ఈ విషయం తెలుసు, కానీ దీనిపై వారు లేఖ ఇవ్వాలని అన్నారు. అలాగే ముగ్గురు ఇండిపెండెంట్‌ఎంఎల్‌ఎలు ఇప్పటికే మద్దతు ఉపసంహరణపై లేఖ రాశారని, జెపిపి కూడా అలాగే చేయాలన్నారు.
ముగ్గురు ఇండిపెండెంట్‌ ఎంఎల్‌ఎల సోంవీర్‌ సాంగ్వాన్‌(దాద్రి), రణధీర్‌ సింగ్‌ గోలెన్‌ (పంద్రి), ధర్మపాల్‌ గాండర్‌(నీలోఖెరి)లు మంగళశారం బిజెపికి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్‌కు మద్దతిస్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలో బిజెపి నేత జవహర్‌ యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదన్నారు. మార్చి 13నే సైని ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిందని, కావాలంటే మళ్లీ సభా వేదికపై నిరూపించుకుంటామన్నారు.

➡️