పాత్రలు కల్పితాలు

Apr 22,2024 03:40 #edit page, #sahityam

1
ఎలా వుంటుందంటే,
ముందు ఒక కోతి గాల్లోకి దూకుతుంది
దాన్ని చూసి పక్కనే వున్న మరో కోతి
మొదటిదాని కన్నా కాస్త ఎక్కువ ఎత్తు
రెండూ పోటీలు పడి మరీ దూకుతాయి
కొమ్మలు విరిగి చెట్లు కూలి
అడవికి అడవే నాశనమవుతుంటుంది
ఐనా పాత్రలు
ఎవరి నిశ్శబ్దంలో వాళ్లుంటారు
ప్రశాంతతను ప్రేమించినట్టు
మరి దేన్నీ ప్రేమించరు!

ఈ కథలో
ఒక కీలక మలుపు దగ్గర ప్రధాన పాత్రధారి
మనకు ఎదురవుతాడు!

2
ఒకడుంటాడు
నీ ముందుకు రంగుల వల విసురుతాడు
కొన్నాళ్ళు జాగ్రత్తగా నడుస్తావు
ఒకానొక తుపాను రాత్రి
వల మధ్యలో చిక్కుకున్న నువ్వు
నీ విధేయతను అద్దంలో చందమామను చేయడానికి
సమూహానికి సమూహాన్నే ఒడ్డుతావు

ఈ కథలోనూ
మనిద్దరి నీడలూ పోలిక పట్టలేనంతగా
కలిసిపోయి వుంటాయి!

3
ఒకరోజు నిజంగా
కిరీటం మన చేతుల్లోకి వస్తుంది
తలలు పోటీ పడతాయి
పొరుగువాడి మేలును శాశ్వతంగా వాయిదా వేసి
సొంత లాభమే చూసుకుంటాం!

4
నీరందని ఒక పొలం
మనిద్దర్నీ శపిస్తుంది
రోడ్డున పడ్డ వరికంకులు
ఉరితాళ్ళలో ముఖం దాచుకుంటాయి
అప్పుడే పుట్టిన పిల్లాడు
పలక మీద అబద్ధాన్ని రాసుకుని
ట్రాఫిక్‌ ఐలాండ్‌ దగ్గర ఎదురవుతాడు
చూపుడు వేలు రాసుకున్న స్వప్నం
ఈవీఎం బీప్‌ సౌండ్లో తప్పిపోతుంది
ఎల్‌ నినో కమ్ముకున్నట్టు
ఆశలు పొడిబారుతుంటాయి
చటుక్కున బొటనవేలును కోసి
పళ్ళెంలో వేసే అలవాటు
హౌమం ముందు తలను నరుక్కునే వరకూ వెళ్తుంది

ఒక యథార్థ కథలో
కల్పిత పాత్రలు
జరుగుతున్నది మాయజూదం అని
పాచికలకు తెలీదనే భ్రమలో వుంటాయి!

– సాంబమూర్తి లండ

➡️