బిజెపి పాలన ఎఫెక్టు ఖాయిలాపడ్డ మధ్యప్రదేశ్‌!

bjp-govt-failure-in-madyapradesh-health-sector

గుజరాత్‌ తర్వాత బిజెపి ఎక్కువ కాలం పాలించిన రాష్ట్రం మధ్యప్రదేశ్‌. 2002 నుండి ఇప్పటివరకు మధ్యలో ఏడాదిన్నర కాలం మినహా మిగిలిన కాలమంతా బిజెపి పాలనలోనే ఈ రాష్ట్రం వుంది. ఆ ఏడాదిన్నర కాలంలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఫిరాయింపుల ద్వారా పడగొట్టారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ, ఖాయిలా పడిన రాష్ట్రాన్ని గత 18ఏళ్ల కాలంలో పోలికే లేని రీతిలో తీర్చి దిద్దింది బిజెపినే అని సెలవిచ్చారు.
ఇంత సుదీర్ఘ కాలం రాష్ట్రాన్ని పాలించిన తర్వాత, బిజెపి తన రికార్డును సమర్ధించుకోవాల్సి వుంది. అందుకే, మధ్యప్రదేశ్‌ ఖాయిలా రాష్ట్రమనే ట్యాగ్‌ను పొగొట్టుకుని దేనితోనూ పోలిక లేని రాష్ట్రంగా మారిందని అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌లే కాకుండా పలువురు బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు.
బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి హిందీ ప్రాంత రాష్ట్రాలకు వాటి ఆర్థిక వెనుకబాటుతనాన్ని, దిగజారిన సామాజిక సూచికలను నొక్కి చెప్పడానికి బీమారు (ఖాయిలా) ట్యాగ్‌ను జత చేస్తూ వుంటారు. బిజెపి పాలనలో రాష్ట్రం చాలా వేగంగా పురోగతిని సాధించిందని ప్రకటించడం ద్వారా మధ్యప్రదేశ్‌కు వున్న ముద్రను పోగొట్టాలని బిజెపి ప్రయత్నిస్తోంది. అయితే అసలు వాస్తవం ఏమిటి, ఎలా వుంది? మధ్యప్రదేశ్‌ ఆర్థిక పనితీరు దేశంలోనే అత్యంత అధ్వానంగా వుంది. 1993-94లో, తలసరి నికర రాష్ట్ర దేశీయోత్పత్తి విషయంలో 27 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ 19వ స్థానంలో వుంది. అయితే, 2021-22కు వచ్చేసరికి కేవలం రెండు స్థానాలు మాత్రమే పైకి ఎగబాకింది. నీతి ఆయోగ్‌ సమాచారం ప్రకారం, రాష్ట్రంలో సగానికి పైగా జనాభా అత్యంత నిరుపేదలుగా వున్నారు. విద్యకు సంబంధించినంతవరకు చూసినట్లైతే, 2020లో ప్రాధమిక, హయ్యర్‌ సెకండరీ, కాలేజీ స్థాయి విద్యలో చేరిన విద్యార్థులు వంటి సూచికల్లో మొత్తం 30 రాష్ట్రాలకు గాను మధ్యప్రదేశ్‌ 20వ స్థానంలో వుంది. సామాజిక సూచీల్లోనూ మధ్యప్రదేశ్‌ ర్యాంక్‌ చాలా అధ్వానంగా వుంది. ఉదాహరణకు, 2019-21లో మధ్యప్రదేశ్‌లో 35.7శాతం మంది పోషకాహారం లోపంతో బాధపడుతున్న పిల్లలు వుండేవారు. మొత్తంగా 30 రాష్ట్రాలకు గాను 25వ ర్యాంక్‌లో వుంది. 2015-16, 2019-21 మధ్య కాలంలో వయసుకు తగిన బరువు లేని పిల్లల సూచికకు సంబంధించి మధ్యప్రదేశ్‌ రాష్ట్రం కేవలం రెండు స్థానాలు (28 నుండి 26కు) మాత్రమే పైకి ఎగబాకగలిగింది. మొత్తంగా అన్ని రంగాల్లో మధ్యప్రదేశ్‌ సామాజిక స్థాయి అనేది మానవ వికాస సూచీ (హెచ్‌డిఐ)లో ర్యాంక్‌ ద్వారా తెలుస్తోంది. 2021లో 30రాష్ట్రాల్లో ఎంపి స్థానం 27గా వుంది. సామాజిక ఆర్థిక సూచీల్లో మధ్య ప్రదేశ్‌ మొత్తం రాష్ట్రాల్లో దిగువ సగ భాగంలో కొనసాగుతుండడాన్ని ఏమనాలి? శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని మతతత్వ- కార్పొరేట్‌ ప్రభుత్వ తప్పుడు విధానాల ఫలితమే ఇది అని చెప్పకతప్పదు. విచక్షణారహితంగా గనుల తవ్వకాలకు అనుమతించడంతో మధ్య ప్రదేశ్‌లో సహజ వనరులు యథేచ్ఛంగా కొల్లగొట్టబడుతున్నాయి. తాజాగా ధీరౌలి బొగ్గు గనుల తవ్వకాల లీజును అదానీ గ్రూపునకు ఇచ్చారు. ఈ బొగ్గు గని 2,672 హెక్టార్లలో అంటే అడవులు, బొగ్గు క్షేత్రాలు, గ్రామాల్లో విస్తరించి వున్నాయి.
జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం, 2021లో మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్డ్‌ తెగలపై అధిక సంఖ్యలో అత్యాచారాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 29.8 శాతం మధ్యప్రదేశ్‌లోనే చోటు చేసుకున్నాయి. షెడ్యూల్డ్‌్‌ కులాలపై జరిగిన అత్యాచారాల కేసుల్లో కూడా 14.1శాతం కేసులతో ఈ రాష్ట్రం మూడవ స్థానంలో వుంది. 2019లో ప్రస్తుత బిజెపి ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా అనుసరిస్తున్న హిందూత్వ ఎజెండాతో మైనారిటీలపై ఏ విధంగా దాడులు చేస్తున్నదీ చూస్తున్నాం. ఇండోర్‌లో ముస్లిం వీధి వ్యాపారులపై దాడులు, ఖార్గావ్‌లో ముస్లింల ఇళ్ళను ధ్వంసం చేయడం, మైనారిటీలను వేధించడం వంటివి నిత్యకృత్యంగా మారాయి. క్రైస్తవ ఆరాధనా స్థలాలను కూడా వదిలిపెట్టడం లేదు.ఇప్పటివరకు చెప్పినట్లుగా, మధ్యప్రదేశ్‌లోని మతతత్వ- కార్పొరేట్‌ ప్రభుత్వ స్వభావం రాష్ట్ర వ్యవహారాలన్నీ నాశనమవడానికి మాత్రమే దారి తీసింది. మతోన్మాదమనే వ్యాధితో బాధపడుతున్న సమాజంగా వుంది. దళితులు, ఆదివాసీలు, మైనారిటీల అణచివేత ద్వారా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్న ఈ ప్రభుత్వ పనితీరుపై ప్రజలిచ్చే తీర్పు శుక్రవారం జరిగే పోలింగ్‌లో ప్రతిబింబిస్తుందని ఆశిద్దాం.

➡️