విద్యుత్‌ భారాలు, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా విశాల ఐక్య ప్రజా ఉద్యమం : సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న విద్యుత్‌ భారాలకు, స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా విశాల ఐక్య ఉద్యమం చేపట్టాలని ప్రజానీకానికి సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అటువంటి ఉద్యమంతోనే విద్యుత్‌ భారాలను తిప్పికొట్టగలమని పేర్కొంది. ఈ మేరకు రెండురోజులపాటు జరిగిన సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం మీడియాకు విడుదల చేశారు రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ స్కీమ్‌ (ఆర్‌డిఎస్‌ఎస్‌) అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్‌మీటర్ల ఏర్పాటును ఉపసంహరించాలని, ఇప్పటికే అధిక విద్యుత్‌ భారాలతో బాధపడుతున్న వినియోగదారులపై తాజాగా ప్రతిపాదించిన రూ.7,200 కోట్ల ట్రూ అప్‌ భారాన్ని విరమించాలని ఈ తీర్మానాల్లో సిపిఎం డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే భారాలను తిప్పికొట్టేందుకు విశాల ఐక్య ఉద్యమం సాగించాలని ప్రజలను కోరింది.

తీర్మానం వివరాలు : ‘విద్యుత్‌ సవరణ చట్టం పేరుతో క్రాస్‌ సబ్సిడీ విధానం ఎత్తేసి, విద్యుత్‌ పంపిణీ పూర్తిగా ప్రయివేటు చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి మొండిగా వ్యవహరిస్తోంది. 2400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే ఆధునిక నెల్లూరు జెన్‌కోను అదానికి అప్పగించడానికి రాష్ట్ర కేబినెట్‌ బిడ్డింగ్‌ వరకు వెళ్లింది. అక్కడి జెన్‌కో పోరాట కమిటీ సిఐటియు అడ్డుకోవడంతో ఆ నిర్ణయం ఆగిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ‘డైనమిక్‌ ప్రైసెస్‌’ పేరుతో ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనడం ద్వారా ప్రజలపై భారాలు పెరుగుతున్నాయి. స్మార్ట్‌మీటర్ల కొనుగోలు, సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాలపై సమీక్ష చేయాలి. టెండర్లు పారదర్శకంగా ఉండాలి. వేలకోట్ల కుంభకోణాన్ని అరికట్టాలి.’ అని తీర్మానంలో పేర్కొన్నారు. ‘వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్ల ఏర్పాటుతో అదనపు ప్రయోజనం చేకూరలేదని శ్రీకాకుళం జిల్లాలో అధ్యయనం చేసిన ప్రయాస్‌ (పూణె) సంస్థ ఇప్పటికే నిర్ధారించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. సరికదా వాణిజ్య, గృహ కనెక్షన్లకూ స్మార్ట్‌మీటర్లు బిగిస్తామని, తొలిదశలో అమృత్‌ పథకంలోని నగరాల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువధరకు వీటిని తీసుకుంటున్నారని తెలిపింది. ఆ ఖర్చును వినియోగదారులపై మోపుతోంది. వినియోగదార్లకు భారంగా, కార్పొరేట్లకు లబ్దిచేకూర్చే స్మార్ట్‌మీటర్ల విధానాన్ని ఇప్పటికే కేరళ వామపక్ష ప్రభుత్వం సహా పలు ప్రభుత్వాలు పక్కనబెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా స్మార్ట్‌మీటర్ల ఏర్పాటును పూర్తిగా ఉపసంహరించుకోవాలి.’ అని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది.

                                                                          ట్రూ అప్‌భారాలపై

‘ఇప్పటికే 2014-19 కాలానికి రూ.2,910 కోట్లు, 2021-22 సంవత్సరానికి సంబంధించి రూ.3,083 కోట్లు ట్రూఅప్‌ ఛార్జీల పేరిట వినియోగదార్లపై అదనపు భారాలు మోపారు. ఇది కాక ఎఫ్‌పిపిసిఎ పేరుతో నెలనెలా యూనిట్‌కి కనీసం రూ.0.40 పైసలు బాదేస్తున్నారు. ఇలాంటి భారాలన్నీ ఉండగా తాజాగా ఎపిఇఆర్‌సికి 2022-23 సంబంధించి రూ.7,200 కోట్ల ట్రూఅప్‌ను డిస్కాములు ప్రతిపాదించడం దారుణం. ట్రూఅప్‌ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. కనీసం ఈ తాజా ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి.’ అని డిమాండ్‌ చేసింది. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ బ్యాంకు ఆదేశిత సంస్కరణలను అమలు చేసినపుడు ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి అప్పటి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం అందరూ గుర్తు చేసుకోవాలి. అవే విధానాలను మోడీ సర్కారు షరతులకు తలొగ్గి ఇప్పటి ప్రభుత్వం అమలు చేస్తోంది. విద్యుత్‌పై అదానీకి గుత్తాధిపత్యం కట్టబెట్టడానికే మోదీ సర్కార్‌ తప్పుడు షరతులు రుద్దుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మోడీకి లొంగిపోయి అదానీ సేవలో తరిస్తోంది. స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు, ట్రూఅప్‌ ఛార్జీల విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే విశాల ఐక్య ప్రజాఉద్యమం సాగించడం అవసరం. అందుకు ప్రజలు సన్నద్ధం కావాలి. తద్వారా భారాలను తిప్పికొట్టాలి’ అని సిపిఎం విజ్ఞప్తి చేసింది.

అర్హులైన అసైన్డ్‌ లబ్దిదారులకే హక్కులు

‘అసైన్డ్‌ భూములు పొంది 20 సంవత్సరాలు అనుభవం ఉన్న పేదలకు యాజమాన్యపు హక్కులు కల్పిస్తామని, అక్రమంగా అనుభవిస్తున్న భూస్వాముల నుండి వెనక్కి తీసుకొని నిజమైన పేదలకు, లేదా వారి వారసులకు తిరిగి ఇప్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్‌ చట్ట సవరణ చేసింది. తద్వారా ప్రతి పేద కుటుంబాన్ని సంపన్నులుగా మార్చడమే వైసిపి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి ప్రకటించడంతో అసైన్డ్‌ భూములు పొందిన పేదలు సంతోషించారు. కానీ ఆ సంతోషం నుండి తేరుకోక ముందే రాష్ట్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. అసైన్డ్‌ భూములు అనుభవిస్తున్న పెద్దలు మార్కెట్‌ రేటుకు రెండున్నర రెట్లు పరిహారం చెల్లిస్తే వారికే హక్కులు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిని సిపిఎం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రకటన వల్ల లక్షలాది పేద, దళిత కుటుంబాలకు తీవ్రమైన నష్టం జరుగుతోంది. 9/77 అసైన్డ్‌ చట్టసవరణ సందర్భంగా నిజమైన అసైన్డ్‌దారులకే హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి. సన్న, చిన్నకారు రైతుల జోలికి పోకుండా అక్రమంగా అసైన్డ్‌ భూములు పొందిన భూస్వాములు, గ్రామీణ సంపన్నుల నుండి భూములు స్వాధీనం చేసుకొని అర్హులైన పేదలకు వారి వారసులకు హక్కులు కల్పించాలి. కోనేరు రంగారావు భూకమిటీ సిఫార్సుల మేరకు అర్హులందరికీ భూపంపిణీ చేపట్టాలి’ అని సిపిఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

‘వామపక్ష పార్టీలు, ప్రజా ఉద్యమాలు ఫలితంగా 1947 అనంతరం విభజిత ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 26 లక్షల కుటుంబాలకు 33 లక్షల ఎకరాలకు ప్రభుత్వాలు పేదలకు భూ హక్కులు కల్పించబడ్డాయి. ఈ భూములను గ్రామంలో పలుకుబడి కలిగిన భూస్వాములు పేదలకు ఆశచూపి, లేదా దౌర్జన్యంగా సుమారు 15 లక్షల ఎకరాల వరకు అక్రమంగా అనుభవిస్తున్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. కోనేరు రంగారావు నాయకత్వంలో వేసిన భూ కమిటీ కూడా చెప్పింది. రాజశేఖర్‌రెడ్డి నుండి నేటి జగన్‌మోహన్‌రెడ్డి వరకు పేదలకు ఈ భూములు తిరిగి ఇప్పిస్తామని హామీ ఇస్తూ వచ్చారు. అందులో భాగంగానే విభజిత ఆంధ్ర రాష్ట్రంలో అన్యాక్రాంతమైన అసైన్డ్‌ హక్కుదారులకు అన్ని హక్కులు కల్పించడానికే 9/77 అసైన్డ్‌ చట్టం సవరించి అసెంబ్లీలో తీర్మానం చేశారు. అన్ని గ్రామ సచివాలయాల్లో అసైన్డ్‌ లబ్దిదారుల లిస్టు బహిర్గతం చేస్తామని, అభ్యంతరాలు ఉన్న పేదలు తమ అభిప్రాయాలను చెప్పాలని కోరింది. ఇవేమీ చేయకుండా అసైన్డ్‌దారుల విన్నపాలు స్వీకరించకుండా, ఏకపక్షంగా భూస్వాములకు మేలు చేయడానికి, ఆ పేరుతో ప్రభుత్వం డబ్బులు దండుకోవడానికి అక్రమంగా అనుభవిస్తున్న వారి ప్రయోజనాలను కాపాడడానికి ప్రభుత్వం నిర్ణయించడం సిగ్గుచేటు. నిరంతరం దళిత, గిరిజన, బలహీనవర్గాల జపంచేసే జగన్‌ ప్రభుత్వం ఆ తరగతుల వారికే హాని తలపెట్టడాన్ని సిపిఎం గర్హిస్తున్నది. ఈ నిర్ణయం వల్ల అసలైన అసైన్డ్‌దారులు దళితులు, బలహీనవర్గాల పేదలకు తీవ్రమైన నష్టం జరుగుతోంది. ప్రభుత్వం చేసిన చట్ట సవరణ ప్రకారం భూస్వాముల ఆధీనంలో ఉన్న అసైన్డ్‌ భూములను తిరిగి హక్కుదారులకు ఇవ్వాలని కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల మేరకు భూమిలేని పేదలకు భూపంపిణీ చేయాలని, మార్కెట్‌ రేటుకు రెండున్నర రెట్లు పరిహారం చెల్లించే విధానం ఉపసంహరించాలి’ అని సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

➡️