పాలస్తీనా అనుకూల పోస్ట్‌కు ప్రిన్సిపల్‌ మద్దతు .. విధుల నుండి తొలగింపు

ముంబయి :   పాలస్తీనా అనుకూల పోస్ట్‌కు మద్దతు తెలిపిన ఓ ప్రిన్సిపల్‌ను విధులనుండి తొలగించారు. మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటనపై పలువురు మండిపడుతున్నారు. ప్రిన్సిపల్‌ పర్వీన్‌ షేక్‌ను తొలగిస్తున్నట్లు ముంబయిలోని సోమయ్య పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా పర్వీన్‌ సోషల్‌ మీడియా కార్యకలాపాలలో నిమగమయ్యారని నోటీసుల్లో పేర్కొంది. అయితే ఆమె సోషల్‌ మీడియాలో పాలస్తీనా అనుకూల పోస్ట్‌కు మద్దతు తెలపడం గమనార్హం.   దీంతో గత కొన్ని రోజులుగా   ఆమె వేధింపులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

విధుల నుండి తొలగింపు నిర్ణయాన్ని పర్వీన్‌ షేక్‌ వ్యతిరేకించారు. ఆ నిర్ణయం తప్పు, అన్యాయంగా పేర్కొన్నారు. తనను విధుల నుండి తొలగించినట్లు పాఠశాల యాజమాన్యం నుండి నోటీసులు రాకముందే సోషల్‌ మీడియాలో వార్తవైరలవడంపై షాక్‌ అయ్యానని అన్నారు. ఆ నోటీసు చట్ట విరుద్ధమని, ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలతో, పరువు నష్టం కలిగించే విధంగా ఉందని మండిపడ్డారు.  12 సంవత్సరాలుగా పాఠశాల అభివృద్ధికి కృషి చేశానని, అంకిత భావం, నిజాయితీతో కూడిన సహాకారం అందించానని అన్నారు.

తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు యాజమాన్యం తనకు అండగా నిలవకూడదన్న నిర్ణయం నిరాశ కలిగించిందని అన్నారు. ఈ చర్య రాజకీయ ప్రేరేపితమైనదిగా కనిపిస్తుందని  అన్నారు. న్యాయవ్యవస్థ, భారత రాజ్యాంగంపై తనకు విశ్వాసం ఉందని, చట్టపరంగా ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తానని పర్వీన్‌ షేక్‌ పేర్కొన్నారు.

➡️