Lok Sabha Election: మూడో దశ 63 శాతం పోలింగ్‌

May 8,2024 08:50 #Lok Sabha elections, #Phase 3

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ ఎన్నికలకు మూడో విడత పోలింగ్‌ 61.48 శాతం జరిగింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకూ జరిగింది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 93 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. అత్యధికంగా అస్సాం(4)లో 75.26 శాతం, గోవా(2)లో 74.27 శాతం, పశ్చిమ బెంగాల్‌(4)లో 73.93 శాతం పోలింగ్‌ జరిగింది. కర్ణాటక (14)లో 67.76 శాతం, ఛత్తీస్‌గఢ్‌ (7)లో 66.99 శాతం, దాద్రా నగర్‌ హవేలీ, డామాన్‌ డయ్యూ (2)లో 65.23 శాతం, మధ్యప్రదేశ్‌ (9)లో 63.09 శాతం, ఉత్తరప్రదేశ్‌ (10)లో 57.34 శాతం, గుజరాత్‌ (25)లో 56.76 శాతం, బీహార్‌ (5)లో 56.55 శాతం, మహారాష్ట్ర (11)లో 54.77 శాతం పోలింగ్‌ జరిగింది.

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో టిఎంసి కార్యకర్తలు ఓటర్లను బూత్‌లోకి రాకుండా అడ్డుకున్నారని సిపిఎం అభ్యర్థి, రాష్ట్ర కార్యదర్శి ఎండి సలీం విమర్శించారు. రాణినగర్‌ ప్రాంతంలోని బూత్‌లోకి ప్రవేశించకుండా టిఎంసి కార్యకర్తలు ఓటర్లను అడ్డుకున్నారని పేర్కొంటూ ఎన్నికల కమిషన్‌కు సలీం ఫిర్యాదు చేశారు. ఒక బూత్‌లో, సలీం నకిలీ టిఎంసి ఏజెంట్‌ను గుర్తించారు. తరువాత ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.”నాకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు. ఓటర్లకు సహాయం చేయడానికి నేను అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశా. ఓటర్లను పోలింగ్‌ బూత్‌లలోకి రాకుండా అడ్డుకునే అవాంఛనీయ వ్యక్తులను పట్టుకుంటా” అని ఆయన విలేకరులతో అన్నారు. టిఎంసి కార్యకర్తలు ఓటర్లను బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గంలో బూత్‌లను దోచుకునేందుకు బిజెపి కార్యకర్తలు ప్రయత్నించారని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తులను పోలీసు స్టేషన్‌లలో నిర్బంధించారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు. తన భార్య, సిట్టింగ్‌ ఎంపి డింపుల్‌ యాదవ్‌ పోటీలో ఉన్న మెయిన్‌పురి నియోజకవర్గానికి సైఫారు (ఇటావా)లో ఓటు వేసిన యాదవ్‌, కొన్ని చోట్ల ఓట్లు రిగ్గింగ్‌ జరిగినట్లు ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు తాము ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్‌ నేత దిగ్విజరు సింగ్‌ అన్నారు. ఎక్కడైతే బోగస్‌ ఓటింగ్‌ జరిగిందో అక్కడ తమ కార్యకర్తలు అడ్డుకుంటారని చెప్పారు. మెషీన్‌ (ఈవిఎం) ఏదైనా మెషీన్‌ అని, తానెప్పుడూ ఈవీఎంలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘఢ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈవిఎంలో మీ ఓటు ఎటు వెళ్లిందో మీరు చూడలేరని అన్నారు. వివిప్యాట్‌ మెషీన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉంటుందని, అసలు ఏం జరగాలనేది ఆ సాఫ్ట్‌వేర్‌ నిర్ణయిస్తుందని దిగ్విజరు పేర్కొన్నారు. మనం ఏం చేసినా సాఫ్ట్‌వేర్‌ తాను కోరుకున్నదే ప్రింట్‌ చేస్తుంది..దాన్నే ఎన్నికల అధికారులు కౌంట్‌ చేస్తారని దిగ్విజరు సింగ్‌ వ్యాఖ్యానించారు.

మూడో విడత పోలింగ్‌ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోలింగ్‌ ప్రారంభమైన తొలి గంటలోనే ఓటు వేశారు. గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్‌ పరిధిలోని అహ్మదాబాద్‌లో ఉన్న నిషాన్‌ హైస్కూల్‌లో ప్రధాని మోడీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా కేంద్ర హౌం శాఖ మంత్రి, గాంధీనగర్‌ బిజెపి ఎంపి అభ్యర్థి అమిత్‌ షా సైతం తన కుటుంబంతో కలిసి అహ్మదాబాద్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి సోనాల్‌ షా, కుమారుడు, బిసిసిఐ కార్యదర్శి జైషా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.

ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి విదిశ లోక్‌సభ అభ్యర్థి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కేంద్ర మంత్రులు మన్‌సుఖ్‌ మాండవీయ, ప్రహ్లాద్‌ జోషీ, జ్యోతిరాదిత్య సింధియా, బారామతి ఎంపి అభ్యర్థులు సుప్రియా సూలే, సునేత్ర పవార్‌, మహారాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్‌ పవార్‌, ఎన్‌సిపి చీఫ్‌ శరద్‌ పవార్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌లో అదానీ గ్రూపు చైర్మెన్‌ గౌతమ్‌ అదానీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహమ్మద్‌పురా ప్రైమరీ స్కూల్‌లో ఉన్న పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటేశారు. యాక్టర్స్‌ రితీష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా మహారాష్ట్రలోని లోతార్‌ లో ఓటు వేశారు.

➡️