దోసపాడు పేదల పట్ల మొండి వైఖరి వీడాలి

Jan 24,2024 21:40 #Dharna, #people

– వ్యకాస జిల్లా కార్యదర్శి రామకృష్ణా చేపల చెరువుల వద్ద పేదల నిరసన

ప్రజాశక్తి – దెందులూరు (పశ్చిమగోదావరి జిల్లా): రెవెన్యూ అధికారులు మొండిగా వ్యవరిస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం దోసపాడు గ్రామంలోని చేపల చెరువుల వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన బుధవారం పేదలు నిరసన తెలిపారు. చెరువుల్లోని నీటిని బయటకు పంపి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ దోసపాడు పేదలు, దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా రెవెన్యూ అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళితులపై రెవెన్యూ అధికారులు అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం మానుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దళితుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే జిల్లా అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. 15 నెలల నుంచి మొక్కవోని దీక్షతో పేదలు పోరాడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని తెలిపారు. మొదట జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో 32 ఎకరాలు ఉందని చెప్పి, ఇప్పుడు దాన్ని 72 ఎకరాలకు మార్చి పేదలకు చెందిన అసైన్డ్‌ భూముల రికార్డులను మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత భూముల రికార్డులను పరిశీలించాలని కోరారు. భూ చట్టాలను, హక్కులను కాలరాస్తున్న మండల రెవెన్యూ శాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దోసపాడు పేదల న్యాయమైన కోర్కెలను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వం వారికి అండగా నిలవాలని కోరారు. దోసపాడు దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఆనంద్‌రావు, నాగేంద్ర, భూ పోరాట నాయకులు రాజు, పవన్‌, శ్రీను ఏసు, మణి, కుమారి మాణిక్యం పాల్గొన్నారు.

➡️