ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై చర్యలు : సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా

  • వివిఐపి బందోబస్తుకు వెళ్లిన పోలీసులకు 9న బ్యాలెట్‌ను ఉపయోగించుకునే అవకాశం
  • ఇప్పటి వరకు 3.03 లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు వినియోగం – సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం సమయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా హెచ్చరించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో లంచాలు ఇచ్చేవారితోపాటు లంచాలు పుచ్చుకునే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొంత మంది ఉద్యోగులు ప్రలోభాలకు లోబడుతూ నగదు కూడా తీసుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డబ్బులు పంచుతున్న నలుగురిని అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశామన్నారు. అనంతపురంలో ఒక కానిస్టేబుల్‌ ఉద్యోగుల జాబితాను పట్టుకుని నగదు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించామని, ఆయన్ను వెంటనే సస్పెండ్‌ చేశామని చెప్పారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఫెసిలిటేషన్‌ సెంటర్‌ దగ్గర కొంత నగదును సీజ్‌ చేశామన్నారు. ఒంగోలులో కొంతమంది యుపిఐ విధానం ద్వారా కొంతమంది ఉద్యోగులకు నగదు పంపినట్లు గుర్తించామన్నారు. సంబంధిత జిల్లా ఎస్‌పిని సమగ్ర విచారణ చేయాలని ఆదేశించామని చెప్పారు. అలాగే వివిఐపిల పర్యటనల బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది, అధికారులు ఈ నెల 9న తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా వెల్లడించారు.

ఇప్పటి వరకు 70 శాతం పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం
పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 4.30 లక్షల మంది ఉద్యోగుల్లో ఇప్పటి వరకూ 3.03 లక్షల (70 శాతం) లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని సిఇఒ తెలిపారు. కొన్ని జిల్లాల్లో 3న, మరికొన్ని జిల్లాల్లో 4న హోమ్‌ ఓటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రారంభమైందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో 3.20 లక్షల మంది ఉద్యోగులు, 40 వేల మంది పోలీసులు, హోమ్‌ ఓటింగ్‌ కేటగిరి కింద 28 వేల మంది, ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ కేటగిరి కింద 31 వేలమందితో పాటు సెక్టారు ఆఫీసర్లు ఉన్నట్లు తెలిపారు. వీరిలో 2.76 లక్షల మంది ఉద్యోగులు ఫెసిలిటేషన్‌ సెంటర్లలోనూ, హోమ్‌ ఓటింగ్‌, ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ కేటగిరి కింద 28 వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు.

➡️