ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఎం లక్ష్యం

  • నెల్లూరులో ఇంటింటి ప్రచారంలో వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి – నెల్లూరు :ప్రతి నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజా పక్షాన నిలిచే సిపిఎం పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. నెల్లూరులో సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌కు ఓట్లు వేయాలని కోరుతూ గురువారం నగరంలోని శెట్టిగుంట రోడ్డు ప్రాంతంలో ఆయన నాయకత్వాన ఇంటింటి ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిపిఎం అభ్యర్ధిగా ఎన్నికల బరిలో నిలిచిన మూలం రమేష్‌కు యువజన సంఘంలో పనిచేసిన అనుభవం ఉందన్నారు. కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మిగతా అభ్యర్థులకు భిన్నంగా ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఉద్యమాలు, పోరాటాలతో ముందుకు సాగారని తెలిపారు. అటువంటి అభ్యర్ధికి ఓట్లు వేసి గెలిపించుకోవడం ప్రజలందరి బాధ్యత అని చెప్పారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలందరి తరుపున పోరాటం చేశారని.. నేడు ప్రజలు, ఉద్యోగుల, వ్యాపారస్తుల, శ్రామిక మహిళల తరుపున పోరాటం చేసేందుకు అసెంబ్లీలో ఒక గొంతుకు కావాలని అది కమ్యూనిస్టు పార్టీకి చెందిన అభ్యర్ధి మూలం రమేష్‌ వల్లే సాధ్యమవుతుందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని, మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. దాంతో జతకట్టిన టిడిపి-జనసేనలను, నిరంకుశ వైసిపిని ఓడించాలన్నారు. బిజెపి-టిడిపి-జనసేన కూటమి, వైసిపి అభ్యర్థులు ఇబ్బడిముబ్బడిగా నగదు, మద్యం పంపిణీ చేసి ఓట్లు కొనుగోలు చేసి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి సంపాదనకు ఒక సాధనంగా మార్చుకుంటు న్నాయని విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలు లేవని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, ధరలు ఆకాశాన్నంటు తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు బతుకుదెరువు ఒక సమస్యగా మారిపోయిన ఈ రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేసే సిపిఎం అభ్యర్ధి గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జిల్లాలో జెన్‌కోను ప్రయివేటీకరణ చేయకుండా అడ్డుకున్నామంటే అది సిపిఎం, ట్రేడ్‌ యూనియన్లు చేసిన పోరాట ఫలితమే అని గుర్తు చేశారు. సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి, అభ్యర్థి మూలం రమేష్‌ మాట్లాడుతూ… తాము ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో స్థానికులు అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ముఖ్యంగా తాగునీటి సమస్య, ఇళ్ల రిజిస్ట్రేషన్‌ చేసుకొనేందుకు అనుమతులు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి సిపిఎం పోరాటం చేస్తుందన్నారు.

➡️