అంతులేని నష్టం

cyclone effected crop damage in ap

ఇంకా ముంపులోనే పొలాలు, వరి పనలు
ధాన్యం కొనేవారి కోసం రైతుల ఎదురు చూపులు
ఉత్తరాంధ్రలోభారీ వర్షాలు

ప్రజాశక్తి – యంత్రాంగం : మిచౌంగ్‌ తుపాన్‌ అపార నష్టాన్ని మిగిల్చింది. వరి, శనగ, పెసర, కంది, మొక్కజొన్న, మినప, మిరప, పొగాకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పత్తి పూత రాలిపోయింది. పొలాల్లో నీరు నిల్వ ఉండిపోవడంతో పంట ఎందుకూ పనికి రాదని పలువురు రైతులు కన్నీరు మున్నీరయ్యారు. కళ్లాల్లోనూ, రోడ్లపైనా ఆరబోసిన ధాన్యం తడిచి ముద్దవ్వడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పడిపోయిన పంటలను నెలబెట్టుకొని, తడవగా మిలిగిన ధాన్యాన్ని కాపాడుకొనే పనిలో రైతులు నిమగమయ్యారు. వర్షాలకు తడిచిపోయిన వరి పనులను ఆరబెట్టుకుంటున్నారు. ఆదుకొనే వారి కోసం ఎదురు చేస్తున్నారు. పంట నష్టాల అంచనాల్లో అధికారులు ఉన్నారు. వర్షాలు తెరిపిచ్చినా పలు వాగులు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ జరగలేదు. అల్లూరి జిల్లాలో గెడ్డలో ముగ్గురు గిరిజనులు గల్లంతయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పుడు వర్షాలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో అత్యధికంగా 43.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జి.సిగడాం రైల్వే అండర్‌ పాసేజ్‌ మార్గంలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. విజయనగరం ఉమ్మడి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వరికి నష్టం వాటిల్లింది. సువర్ణముఖీనది, గోముఖీ నదులు ఉధృతంగా ప్రవహించడంతో వెంగళరాయసాగర్‌ నుంచి నీటిని కిందికి అధికారులు విడుదల చేశారు. మంగళవారం వరకూ కురిసిన భారీ వర్షాలకు ఎన్‌టిఆర్‌ జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో వరి, మినుము, పత్తి , వేరుశనగ వంటి పంటలకు నష్టం వాటిల్లిందని కలెక్టర్‌ తెలిపారు. మొత్తం 29 సబ్‌ స్టేషన్ల పరిధిలో 199 విద్యుత్‌ స్తంభాలు, 25 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని 52 సంచార బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తక్షణమే దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలను, పరికరాలను పునరుద్ధరించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో పంటలు ముంపునకు గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పత్తి, మిర్చి, జొన్న, మొక్కజొన్న, శనగ, అపరాలు పొగాకు పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 68,055 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, మినుము, పెసర, వేరుశనగ, పొగాకు, పత్తి పంటలు వీటిలో ఉన్నాయి. ధాన్యపురాశులు తడిసి ముద్దవడమే కాకుండా, పలుచోట్ల ధాన్యం కొట్టుకుపోయింది. మిరప, బొప్పాయి, అరటి, కూరగాయలు, పామాయిల్‌ వంటి ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 37,500 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో 33,277 ఎకరాల్లో వరి ఉంది. ఉద్యాన పంటల నష్టం అంచనా వేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. బాపట్ల జిల్లా నల్లమడ ఎగువ ప్రాంతంలో ఎడతెరిపిలేని వర్షాల వల్ల వరద నీటి ఉధృతికి నల్లమడ వాగుకు రెండు చోట్ల గండ్లు పడ్డాయి. జిల్లెళ్లమూడి బ్రిడ్జి వద్ద పిటి ఛానల్‌కు మధ్య నల్లమడ వాగు కట్ట మట్టిని గతంలో తొలగించడంతో మరింత బలహీనపడంతో అక్కడా గండి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో, సంచుల్లో ఇసుక నింపి వరద నీటి ప్రవాహానికి కొంతమేర అడ్డుకట్ట వేశారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 56,880 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని జెడిఎ శ్రీనివాసరావు తెలిపారు. పొగాకు 23,650 ఎకరాలు, మినుము 5972 ఎకరాలు, శనగ 11,460 ఎకరాలు, ఇతర పంటలు 15,798 ఎకరాలలో నష్టం జరిగిందని పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలో 1.75 లక్షల ఎకరాలలో ధాన్యం నీట మునిగిందని కలెక్టర్‌ రంజిత్‌ బాషా తెలిపారు. నెల్లూరు జిల్లాలో వరి ఆకు, నారు మడుల్లో నీరు నిల్చే ఉండడంతో రైతులు ఆందోళన చెరదుతున్నారు. పడిపోయిన విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను అధికారులు పునరుద్ధరించి విద్యుత్‌ సరఫరా చేయడం ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు ఇంకా నిలిచే ఉంది. కాకినాడ జిల్లాలో మొత్తం 33,340 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు సుమారు పది వేల ఎకరాలో వరి చేలు నేలకొరిగినట్లు వ్యవసాయ శాఖాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 1500 ఎకరాల్లో పనుల మీద ఉన్న పంట నీటిలో నానుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో 8,190 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. 6,115 ఎకరాల్లో వరి పంట పూర్తిగా పాడయింది. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సుమారు 15 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. అనకాపల్లి జిల్లాల్లో 25 వేలకుపైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. చోడవరం పట్టణంలో ద్వారక నగర్‌, బానే కోనేరు, కోర్టు సముదాయాల్లోకి నీరు చేరింది. కశింకోట మండలంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కె.కోటపాడు మండలంలో మల్లంపాలెంకు వెళ్లే దారిలో గెడ్డపై వేసిన తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. విశాఖ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూడు ఇళ్లపై మట్టి పెళ్లలు పడిపోవడంతో స్లాబ్‌లపై ఉన్న వాటర్‌ ట్యాంకులు, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి.

అల్లూరి జిల్లాలో ముగ్గురు గల్లంతు

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం భీంపోలు పంచాయతీ సీతపాడు గ్రామానికి చెందిన గిరిజనులు గెమ్మెలి లక్ష్మి, మిరియాల కమల, గెమ్మెలి కుమార్‌… లువ్వ గెడ్డను దాటుతుండగా ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు. కాశీపట్నం సంతకు వెళ్లి తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

➡️