ఆరు వేసవి రైళ్ల ట్రిప్పులు పొడిగింపు : ద.మ.రైల్వే

తెలంగాణ : ఆరు వేసవి రైళ్లను మరికొన్ని ట్రిప్పులు పొడిగిస్తున్నట్లు ద.మ. రైల్వే శుక్రవారం ప్రకటించింది. కాచిగూడ నుంచి తిరుపతికి ప్రతి గురువారం వెళ్లే ప్రత్యేక రైలు (నం.07653)ను మే 1 వరకు, శుక్రవారం..తిరుపతి-కాచిగూడ (నం.07654) రైలు మే 2 వరకు, బుధవారం..సికింద్రాబాద్‌-రామగుండం (నం.07695) రైలును ఏప్రిల్‌ 24 వరకు రైల్వే శాఖ పొడిగించింది. శుక్రవారం ప్రారంభమయ్యే రామగుండం-సికింద్రాబాద్‌ (07696) రైలును ఏప్రిల్‌ 26 వరకు ప్రయాణికులకు అందుబాటులో తెచ్చింది. అలాగే శనివారం.. సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ రైలు (నం.07170) ఏప్రిల్‌ 27 వరకు, ఆదివారం..నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ రైలు (నం.07169)ను ఏప్రిల్‌ 28 వరకు ద.మ.రైల్వే పొడిగించింది.

ఏడాదిలో 148 ఎలక్ట్రిక్‌ రైలు ఇంజిన్లు..
ఎలక్ట్రిక్‌ రైలు ఇంజిన్లను ఈ ఏడాదిలో ప్రవేశపెట్టడంతో పురోగతి సాధించినట్లు ద.మ.రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 148 త్రీఫేజ్‌ ఎలక్ట్రిక్‌ ఇంజిన్ల (లోకోమోటివ్‌)లను వినియోగంలోకి తెచ్చినట్లు వివరించింది. గతేడాదితో పోలిస్తే 45 శాతం ఇంజిన్ల వాడకం పెరిగిందని, ఈ ఇంజిన్లకు పూర్తి నిడివి 22 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉండే రైళ్లను గరిష్ఠంగా 130 కి.మీ వేగంతో పరిగెత్తించగలిగే సామర్థ్యం ఉంటుందని తెలిపింది. 2023-24లో 46 జతల ప్రయాణికుల రైళ్లను డీజిల్‌ నుంచి ఎలక్ట్రిక్‌ ట్రాక్షన్‌కు మార్చింది. ఫలితంగా రైల్వేశాఖకు ఏడాదికి రూ.204 కోట్ల విద్యుత్తు బిల్లులు ఆదా అయిందని ద.మ.రైల్వే పేర్కొంది.

➡️