సాక్షులను కొట్టడం విధి నిర్వహణలో భాగమా? సిబిఐని ప్రశ్నించిన హైకోర్టు

May 8,2024 09:54 #AP High Court, #orders

ప్రజాశక్తి-అమరావతి :సాక్షులను కొట్టడం, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం విధి నిర్వహణలో భాగమా? అని సిబిఐని హైకోర్టు ప్రశ్నించింది. వాంగ్మూలం ఇవ్వాలని సాక్షులపై ఒత్తిడి తేవడం సరికాదని ఆగ్రహించింది. వివేకా హత్య కేసులో సిబిఐ అధికారి రాంసింగ్‌ తీరుపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. సునీత, రాజశేఖర్‌రెడ్డి, రాంసింగ్‌ పిటిషన్లపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. తాను చెప్పిన విధంగానే వాంగ్మూలం ఇవ్వాలని ఫిర్యాదుదారుడిని రాంసింగ్‌ ఒత్తిడి చేశారని విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత అల్లుడు రాజశేఖరరెడ్డి, సిబిఐ అధికారి రాంసింగ్‌ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును తర్వాత వెలువరిస్తామని జస్టిన్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. తాము చెప్పినట్లు వాంగ్మూలం ఇవ్వాలంటూ తనను శారీరకంగా, మానసికంగా వేధించారని పేర్కొంటూ వైఎస్‌ వివేకానందరెడ్డి పిఎ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో ప్రైవేటు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఆ కోర్టు ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు రాజశేఖర్‌ రెడ్డి, సునీత, సిబిఐ అధికారి రాంసింగ్‌పై కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టులో చార్జిషీట్‌ కూడా దాఖలు చేశారు. దీనిని కొట్టేయాలంటూ వారు ముగ్గురు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది.

➡️