అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు

Dec 29,2023 21:55 #cpm leaders, #House Arrest

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి :ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులపై విరుచుకుపడ్డారు. ఎటువంటి నోటీసులూ ఇవ్వకుండానే ముందస్తుగా రాత్రికి రాత్రి ఇళ్లకు వెళ్లి కొందరిని గృహ నిర్బంధం చేశారు. మరికొందరిని ఆయా పరిధిలోని పోలీస్‌ స్టేషన్లకు తీసుకెళ్లి నిర్బంధంలో ఉంచారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాంను ఏలూరులోని సిపిఎం కార్యాలయంలో నిర్బంధించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి గోపాలన్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి, సిపిఐ నాయకులు చెల్లబోయిన రంగారావులను వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి నిర్బంధంలో ఉంచారు. అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ సిపిఎం నాయకులు జెఎన్‌వి గోపాలన్‌ స్టేషన్‌లోనే నిరాహార దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు వి.విజయరామరాజు, జనసేన పార్టీ నాయకులు చెనమలశెట్టి చంద్రశేఖర్‌లను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. జిల్లాలో పలువురు నేతలను గృహనిర్బంధం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలను మున్సిపల్‌ కార్యాలయం వద్ద, సిఐటియు కార్యాలయం వద్ద దాదాపు 60 మందిని అరెస్ట్‌ చేసి సమీప పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. సంఘం నాయకులు సిహెచ్‌.మహాలక్ష్మి, విజయలక్ష్మి, కనకదుర్గలను గృహనిర్బంధం చేశారు. సిఎం పర్యటన అనంతరం వీరందరినీ విడిచిపెట్టారు. సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు శాసనమండలి స్పీకర్‌ మోషేన్‌రాజు ద్వారా తమ సమస్యలపై సిఎంకు వినతిపత్రం అందించారు.సిపిఎం ఖండనముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సిపిఎం, ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కోరింది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంలో సిపిఎం, వామపక్ష, ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేయడం రాష్ట్రంలో పరిపాటిగా మారిందని పేర్కొంది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు.

➡️