శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ప్రజాశక్తి- తిరుమల :ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, ఇఒ ఎవి.ధర్మారెడ్డి పాల్గన్నారు. ఆలయం వెలుపల మీడియాతో చైర్మన్‌ మాట్లాడుతూ.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలు కొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేశామని, ప్రోక్షణం అనంతరం వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అనంతరం యాత్రికులను శ్రీవారి దర్శనానికి అనుమతించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇఒ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

➡️