ఆసరా, ఇబిసి నేస్తం నిధుల నిలుపుదలపై వ్యాజ్యాలు

May 8,2024 21:50 #AP High Court, #judgement

ఇసి వివరణ కోసం విచారణ నేటికి వాయిదా
ప్రజాశక్తి-అమరావతి :వైఎస్‌ఆర్‌ ఆసరా 4వ విడత డబ్బులు విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినివ్వకపోవడాన్ని గుంటూరు వాసులు కె వెంకట దుర్గాదేవి, జె రత్నకుమారి హైకోర్టులో సవాల్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ ఇబిసి నేస్తం మూడో విడత నిధులు విడుదలకు ఇసి అనుమతినివ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ గుంటూరు జిల్లా, ఫిరంగిపురానికి చెందిన డి శివపార్వతి మరో పిటిషన్‌ వేశారు. వీటిని జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ బుధవారం అత్యవసరంగా (లంచ్‌మోషన్‌ రూపంలో) విచారణ చేపట్టారు. ఇబిసి నేస్తం, వైఎస్‌ఆర్‌ ఆసరా పథకాల కింద లబ్ధిదారులకు నిధుల పంపిణీ ఆవశ్యకతను తెలియజేస్తూ రాష్ట్రం ఇచ్చే వినతిపత్రంపై ఇసి తీసుకునే నిర్ణయాన్ని ప్రొసీడింగ్స్‌ రూపంలో తమకు నివేదించాలని ఇసిని ఆదేశించారు. విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఇదే తరహాలో చేయూత, విద్యాదీవెన నిధుల పంపిణీ నిలిపివేతపై దాఖలైన పిటిషన్లతో ఈ రెండు పిటిషన్లను జత చేయాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీ చేశారు.
వైఎస్‌ఆర్‌ ఆసరా కింద గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని పిటిషనర్ల తరఫున న్యాయవాది చెప్పారు. 7.98 లక్షల స్వయం సహాయక బృందాలకు చెందిన 78.94 లక్షల మంది గత నాలుగేళ్లలో రూ.25,570 కోట్ల మేర లబ్ధి పొందారని, 3 విడతల కింద రూ.4,551 కోట్లు పంపిణీ జరిగిందని, 4వ విడత కింద రూ.1,843 కోట్లు పంపిణీ కావాల్సి వుందని వివరించారు. ఇసి అనుమతి నిరాకరణ అన్యాయమన్నారు. గవర్నమెంట్‌ స్పెషల్‌ ప్లీడర్‌ చింతల సుమన్‌ ప్రతివాదన చేస్తూ, వైఎస్‌ఆర్‌ ఆసరా, వైఎస్‌ఆర్‌ ఇబిసి నేస్తం పథకాలు పాతవేనని, అయినప్పటికీ ఇసి నిరాకరించిందని చెప్పారు. ఇసి వివరణ కోసం విచారణ గురువారానికి వాయిదా పడింది.

➡️