ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం : లోకేష్‌

May 7,2024 22:30 #2024 election, #Nara Lokesh

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి:టిడిపి అధికారంలోకి రాగానే ఉద్యోగ, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. విజయనగరంలోని అయోధ్యా మైదానంలో నిర్వహించిన యువగళం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు కల్పించలేదు సరికదా ఉన్న ఉద్యోగాలనూ ఊడదీసిందని విమర్శించారు. తమ కూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, మెగా డిఎస్‌సిపై తొలిసంతకం చేస్తామన్నారు. ఉద్యోగాలు వచ్చేలోపు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, యువతీ, యువకుల్లో నైపుణ్యం పెంచేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వైసిపి ప్రభుత్వంలో ఒక్క ఐటి కంపెనీని ఏర్పాటు కాలేదన్నారు. జగన్‌ రాష్ట్ర అభివృద్ధిని వెనక్కినెట్టేశారని, యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలసపోవాల్సిన పరిస్థితులు కల్పించారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే విశాఖపట్నం కేంద్రంగా ఐటి కంపెనీలు ఏర్పాటు చేసి ఎపిని ఐటి హబ్‌గా మారుస్తామని అన్నారు. గిరిజనుల రిజర్వేషన్ల కోసం జిఒ నెంబర్‌ 3 పునరుద్ధరణకు న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక పంచాయతీలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. దేశం గర్వించదగ్గ రీతిలో రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో విజయనగరం ఎంపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, అసెంబ్లీ అభ్యర్థి పి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు.

➡️